కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు

కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు
  • తొలిసారి రికార్డు స్థాయిలో నమోదైన కరోనా మరణాలు
  • 4 లక్షల 12 వేల 262 కేసులు.. 3 వేల 980 మంది మృతి

న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా అంతే స్థాయిలో జరిగాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్.. దాదాపు అన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించినా నిన్న ఒక్కరోజులో 4 లక్షల 12 వేల 262 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 3 వేల 980 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తొలిసారి రికార్డు స్థాయిలో అత్యధిక కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. అలాగే దేశంలో యాక్టివ్ కేసులు  35 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 కోట్ల  10 లక్షల 77 వేల 410 కరోనా కేసులు నమోదు కాగా 2 లక్షల 30 వేల 168 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 35 లక్షల 66 వేల 398 యాక్టివ్ కేసులు ఉండగా 1 కోటి 72 లక్షల 80వేల 844 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. భారత దేశంలో కరోనా పాజిటివిటీ రేటు  22 శాతంగా నమోదు అయింది. నిన్న ఒక్కరోజే 3 లక్షల 29 వేల మంది  కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అలాగే దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు  82.03శాతంగా ఉంది. ఇందులో యాక్టీవ్ కేసులు 17.00 శాతం, మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు,ఏపీ, ఢిల్లీ, బెంగాల్, రాజస్థాన్, హర్యానా, చత్తీస్ఘడ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.