ఆన్​లైన్  ఫండ్ ​రైజింగ్​లో.. రామస్వామికి రూ.3.7 కోట్ల విరాళాలు

ఆన్​లైన్  ఫండ్ ​రైజింగ్​లో.. రామస్వామికి రూ.3.7 కోట్ల విరాళాలు
  • రిపబ్లికన్  ప్రెసిడెన్షియల్  చర్చ తర్వాత ఒక గంటలోనే ఇంత భారీ మొత్తం

వాషింగ్టన్: రిపబ్లికన్  పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రేసులో ఉన్న ఇండియన్  అమెరికన్ వివేక్ రామస్వామి ఆన్​లైన్ ఫండ్​రైజింగ్​లో దూసుకుపోతున్నారు. రిపబ్లికన్  ప్రెసిడెన్షియల్ డిబేట్  తరువాత జరిగిన ఫండ్ రైజింగ్​లో ఒక గంటలోనే ఆయనకు రూ.3.7 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ డిబేట్  తర్వాత రేసులో ఉన్న అభ్యర్థులపై 504 మందిని సర్వే చేయగా.. రామస్వామికి 28% ఓట్లు వచ్చాయి. ఫ్లోరిడాకు చెందిన రాన్  డెసాంటిస్ 27% ఓట్లు, మాజీ ఉపాధ్యక్షుడు మైక్  పెన్స్ కు 13% ఓట్లు, సౌత్  కరోలినా గవర్నర్  నిక్కీ హెలీకి 7% ఓట్లు దక్కాయి.

అలాగే ఫస్ట్  రిపబ్లికన్  ప్రెసిడెన్షియల్  డిబేట్ లో పాల్గొన్న వారందరిలోనూ రామస్వామి కోసమే గూగుల్​లో అత్యధిక మంది సెర్చ్  చేశారని ఫాక్స్  న్యూస్  తెలిపింది. ఆ తర్వాతి స్థానం నిక్కీ హేలీకి దక్కిందని ఫాక్స్  న్యూస్  పేర్కొంది. ఫస్ట్  రిపబ్లికన్  ప్రైమరీ డిబేట్​లో రామస్వామి ముందున్నారని ప్రముఖ దినపత్రిక ‘ద వాల్ స్ట్రీట్’  జర్నల్  వెల్లడించింది. అయితే, అధ్యక్ష పదవికి చివరి వరకు రేసులో ఉంటారా లేదా అన్న విషయంపై 38 ఏళ్ల రామస్వామి గ్యారంటీ ఇవ్వడంలేదని వాల్ స్ట్రీట్  విమర్శించింది.

ఆ పార్టీ ప్రధాన లీడర్, మాజీ ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్ ను దాటి అధ్యక్ష పదవి రేసులో నిలబడేందుకు రామిస్వామి వద్ద కానీ, మరే ఇతర పోటీదారు వద్ద కానీ తగిన వ్యూహాలు ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. ఇక ప్రత్యర్థుల వ్యూహాలు, విమర్శలను దాటుకొని రిపబ్లికన్  ఫస్ట్  డిబేట్​లో రామస్వామి ఫస్ట్  ప్లేస్​లో నిలిచారని ‘ద న్యూయార్క్  టైమ్స్’ పేర్కొంది. ఈ డిబేట్​ను వివేక్  రామస్వామి షోగా ఎన్ బీసీ న్యూస్ చానెల్ అభివర్ణించింది. 

పోటీ నాకు, ట్రంప్​కు మధ్యే.. వివేక్  రామస్వామి

రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్  డిబేట్  అనంతరం మీడియా తో వివేక్  రామస్వామి మాట్లాడారు. తాను, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్  మాత్రమే అధ్యక్ష పదవికి రేసులో ఉంటామని ఆయన పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో అత్యధిక నైపుణ్యం ఉన్న అమెరికా ప్రెసిడెంట్లలో ట్రంప్  ఒకరని రామస్వామి చెప్పారు.