తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం

తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం

విజయదశమి...విజయానికి ప్రతీక. తెలంగాణలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలిస్తే..తెలంగాణలో విజయదశమిని దసరా అని పిలుస్తారు. దసరా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది జమ్మిచెట్టు..పాలపిట్ట. దసరా పండగ రోజు ప్రజలు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ్ బలయ్ చేసుకుని జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు.

పాలపిట్టనే ఎందుకు చూడాలి..?
దసరా రోజున పాలపిట్టను తప్పక దర్శించాలంటారు. పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రాదాయం. ప్రతీ రోజూ పాల పిట్ట దర్శనమిస్తుందో లేదో కానీ..దసరా రోజున ఖచ్చితంగా పాలపిట్ట కనిపిస్తుంది. విజయదశమి రోజున పల్లె  పంట పొలాల్లో పాలపిట్ట తప్పక దర్శనిస్తుంది. కొత్త బట్టలు ధరించి..గ్రామస్తులు అంతా డప్పు చప్పుళ్లతో గ్రామ శివారులోని పంట పొలాల వద్దకు వెళ్లి.. పాలపిట్టను దర్శించుకుని నమస్కరిస్తారు. 

సంప్రదాయం వెనుక కథ..
పాల పిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి. శుభాలకు, విజయాలకు చిహ్నం పాలపిట్ట. అందుకే విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు అదృష్టం, శుభ సూచకంగా భావిస్తారు. అయితే ఈ సంప్రదాయం వెనుక కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో పాండ‌వులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను దాచిపెడతారు. ఈ ఆయుధాలకు ఇంద్రుడు పాల‌పిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత పాండువులు  అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా..పాలపిట్ట దర్శనమిస్తుంది.  అప్పటి నుంచి పాండవుల కష్టాలు అన్నీ తొలగిపోయి..కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దీంతో పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తూ విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని పెద్దలు చెబుతారు. 

పాలపిట్టతో రాముడికి విజయం..
త్రేతాయుగంలో రావణుడితో యుద్ధం చేయడానికి బయలుదేరే ముందు శ్రీరాముడికి విజయ దశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి.. సీతమ్మను రావణ చెరనుంచి విడిపిస్తాడు. అనంతరం పట్టాభిశక్తుడై...ఆయోధ్యకు రాజుగా మారుతాడు. దీంతో అప్పటి నుంచి పాలపిట్టను విజయానికి సూచికగా భావిస్తున్నారని మరికొందరు చెబుతారు. 

ఇంకో కథ..
హిందూ పురాణాల ప్రకారం బ్రాహ్మణ హత్య పాపం. రావణుడు బ్రాహ్మణుడు. పైగా శివ భక్తుడు. అయితే శ్రీరాముడు రావణుడిని సంహరించినప్పుడు..ఆయనకు బ్రాహ్మణ హత్య పాపం అంటుకుంటుంది. దీంతో ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి రాముడు లక్ష్మణుడితో శివుడ్ని పూజిస్తారు. ఈ సమయంలో శివుడు నీలకంఠ పక్షిగా భూమిపైకి వచ్చి..శ్రీరాముడిని  పాప విముక్తిడిని చేశాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

నీలి, గోధుమ వర్ణాల కలయికతో పాలపిట్ట చాలా అందంగా..ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాంస్కృతికంగా, సంప్రదాయంగా..పురాణాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పాలపిట్టకు తెలంగాణ ప్రభుత్వం..రాష్ట్ర పక్షిగా గౌరవం ఇచ్చింది. పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షే కాదు..ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం విశేషం.