భారత్–జపాన్ కళా బంధానికి వేదికగా మాదాపూర్.. ఇండో–జపాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం

భారత్–జపాన్ కళా బంధానికి వేదికగా మాదాపూర్.. ఇండో–జపాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం
  • ప్రారంభించిన అంబేద్కర్ కాలేజీల కరస్పాండెంట్ గడ్డం సరోజ వివేక్..  
  • ఆలోచింపజేస్తున్న వెంకట్,  టకాయమ పెయింటింగ్స్​ 

 

మాదాపూర్, వెలుగు : భారత్–-జపాన్ దేశాల సాంస్కృతిక బంధానికి, సృజనాత్మకతకు మాదాపూర్​స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికైంది. నారా జపాన్ హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండో–-జపాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కన్నుల పండువగా ప్రారంభమైంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, ఆర్టిస్ట్ వెంకట్ గడ్డం, జపాన్ లోని హిరోషిమాకు చెందిన అంతర్జాతీయ చిత్రకారిణి హిరోకో టకాయమ కలిసి అద్భుతమైన లైవ్ పెయింటింగ్ వేసి సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను డాక్టర్​అంబేద్కర్ కళాశాలల కరెస్పాండెంట్ గడ్డం సరోజ వివేక్ ప్రారంభించారు.

ఆమె మాట్లాడుతూ చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న తన కొడుకు  వెంకట్​సృజనాత్మకతతో కళా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రంగులతో ఆడుకోవడం మొదలుకొని, విభిన్న భావోద్వేగాలను చిత్రాల రూపంలో ఆవిష్కరించే స్థాయికి ఎదగడం చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు. ఉన్నత విద్యలో కళారంగాన్నే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబ సభ్యులమంతా ప్రోత్సహించామని వివరించారు. వెంకట్ మాట్లాడుతూ జపాన్ కళాకారిణి టకాయమతో కలిసి ఏర్పాటు చేసిన ఈ ఇండో జపాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఈ నెల 15 వరకు కొనసాగుతుందని, ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుందన్నారు.