కల్లూరులో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ ఆఫీస్..రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మాణానికి మంత్రి తు

కల్లూరులో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ ఆఫీస్..రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మాణానికి మంత్రి తు
  •     10 ఎకరాల్లో రూ.49 కోట్లతో ప్రతిపాదనలు 
  •     మంత్రి తుమ్మలకు అందించిన సబ్ కలెక్టర్​ అజయ్​

ఖమ్మం/ కల్లూరు, వెలుగు:   జిల్లాలోని కల్లూరులో అన్ని హంగులతో కొత్త ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టరేట్ కార్యాలయం రూపుదిద్దుకోనుంది. ఇంటిగ్రేటెడ్ సబ్ డివిజనల్ కలెక్టరేట్ గా ప్రతిపాదన తయారు చేయాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్​ యాదవ్​ ను ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి తుమ్మలకు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్  ఇంటిగ్రేటెడ్​ కార్యాలయ ప్రతిపాదనలు అందించారు.

 ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కు మంత్రి తుమ్మల పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములు, ఎన్ఎస్సీ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి, భూ ఆక్రమణల తొలగింపు, చెరువుల సుందరీకరణకు ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ డివిజనల్ సబ్​ కలెక్టరేట్ నిర్మాణంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ అయ్యి, ఈ నూతన ప్రాజెక్టుకు సీఎం ఆమోదం కోరనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టరేట్ గా కల్లూరు సబ్ కలెక్టరేట్ నిలవనుంది. 

10 ఎకరాల్లో రూ.49 కోట్ల వ్యయం!

కల్లూరు మండలంలో పది ఎకరాల భూమిలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో ఈ సబ్ కలెక్టరేట్ సముదాయం నిర్మించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సబ్ కలెక్టరేట్ ప్రధాన భవనం, విభాగాల కార్యాలయాలు, సమావేశ మందిరాలు, రికార్డు గదులు, పార్కింగ్ స్థలాలు, హరిత వాతావరణం లాంటి అన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. 

సబ్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. ప్రజలు ఒక్కచోటే అన్ని ప్రభుత్వ శాఖల సేవలు పొందగలిగేలా పరిపాలన చేరువ కావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆదాయ, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, పౌర సరఫరాలు, మహిళా సంక్షేమం, విద్య తదితర శాఖల డివిజన్  కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేయనున్నాయన్నారు.

చెరువులకు పూర్వవైభవం 

సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో ఉన్న చెరువుల పునరుద్ధరణకు మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించారు. ఈ చెరువులను మోడల్ చెరువులుగా తీర్చిదిద్దాలని, వాటి అభివృద్ధికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువుల పరిరక్షణ బాధ్యతను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించాలని తుమ్మల ఆదేశించారు. సత్తుపల్లి మండలంలోని వేశ్యకాంతుల చెరువుపై సర్వే చేపట్టి పరిరక్షించాలని తుమ్మల సూచించారు. 

చెరువు భూములకు కబ్జాల నుంచి విముక్తి కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వేంసూరు మండలం కుంచపర్తిలో గ్రామ రాశి భూములపై సర్వే చేపట్టి, వాటిని కబ్జాదారుల నుండి రక్షించాలని ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములకు చట్టపరంగా విముక్తి కల్పించాలన్నారు. భూ సమస్యలను త్వరగా   పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పరిపాలనా వ్యవస్థలో కొత్త దిశ

కల్లూరులో ప్రతిపాదిత మోడల్ సబ్ కలెక్టరేట్ నిర్మాణం అమల్లోకి వస్తే, ఇది రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కొత్త దిశను సూచించే నమూనాగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సమగ్ర సేవలందించే ఈ సముదాయం భవిష్యత్​లో ఇతర జిల్లాలకు ప్రేరణగా మారనుందని అంటున్నారు.