కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు: రేవంత్​

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు: రేవంత్​
  • పోలీస్ వ్యవస్థ రెండుగా చీలిపోయింది
  • మా ఫోన్లే కాదు డీజీపీ ఫోన్​నూ ట్యాప్ చేస్తున్నరు
  • రిటైర్డ్​ అధికారులను దీనికోసమే  వాడుతున్నరని ఆరోపణ

కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు:  రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వల్లనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ఏ వర్గం వారు కూడా స్వేచ్ఛగా లేరని చెప్పారు. ‘‘భయపెట్టి పాలన చేయడం ఈ ప్రాంతానికి మంచిదా..? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భయపడుతూ బతకాలా? ఏందీ దుర్మార్గం” అంటూ ప్రశ్నించారు. ఆనాడు అభివృద్ధి కోసం నక్సలైట్లు ఉండద్దనుకున్నాం.. కానీ ఇప్పుడు వాళ్లుంటేనన్నా ఈ దుర్మార్గం తగ్గునేమో అనుకునే స్థితి వచ్చిందన్నారు. చట్టాలు, శాసనాలు చేసే తాము.. నక్సలైట్లు ఉంటేనన్నా భయపెట్టేవారేమో అనుకునేలా పరిస్థితులు తయారయ్యాయని, ప్రజాప్రతినిధులుగా తాము  అలాంటివి కోరుకోబోమని, కానీ తమ దుఃఖం అలాంటిదని ఆయన చెప్పారు. 
‘‘నక్సలైట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రజలు భయంగా బతకలేదు. కేసీఆర్, ఆయన కుటుంబం కోసమేనా రాష్ట్రం సాధించుకున్నది? కోసి పాతరేయాలనిపిస్తోంది.. నిట్టనిలువునా పాతిపెట్టాలనిపిస్తోంది. ఎందుకురా దేవుడా.. నక్సలైట్లు లేకుండా చేశావ్ అనిపించే  పరిస్థితులు వచ్చినయ్​. ఇందుకు కేసీఆరే కారణం” అని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్​లో రేవంత్​ మీడియాతో మాట్లాడారు. 
భయం భయంగా డీజీపీ కుటుంబం  
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ 2 సామాజిక వర్గాలుగా చీలిందని రేవంత్​ ఆరోపించారు. సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావుకు ఐజీ స్థాయి రెగ్యులర్ ఉన్నత పదవి ఇచ్చారని, తాను ఈ విషయాన్ని చెప్పడంతో తప్పించారని అన్నారు. ఆ తర్వాత ఆయనను పూర్తి స్థాయిలో తన మీద , డీజీపీపై నిఘా కోసం పెట్టారని రేవంత్​ ఆరోపించారు. తమ ఫోన్లే కాదు డీజీపీ ఫోన్ కూడా ట్యాప్​ అవుతోందన్నారు. డీజీపీ వాళ్ల పిల్లలు, కుటుంబం భయం, భయంగా గడుపుతున్నారని, డీజీపీ మీద నిఘా పెట్టి.. ఆయనకున్న హోదాకంటే సామాజిక వర్గంపై దృష్టి పెట్టి అనుమానిస్తున్నారని తెలిపారు. రిటైర్డ్ అయిన సొంత అధికారులను తీసుకువచ్చి.. ఇలాంటి వ్యవస్థలకు వాడటం కేసీఆర్ కే చెల్లిందన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పాతాళానికి తొక్కుడే
హరీశ్ రావును ఖాసీం రజ్వీలాగా పెట్టుకుని నిజాంలాగా కేసీఆర్ పాలన చేస్తున్నారని రేవంత్​ మండిపడ్డారు. ఎన్నడు ఎన్నికలొచ్చినా టీఆర్‌‌ఎస్‌‌ను పాతరేస్తామని.. కేసీఆర్‌‌ను, టీఆర్‌‌ఎస్‌‌ను పాతాళానికి తొక్కుతామన్నారు. కేసీఆర్ గాడ్ ఫాదర్స్ అమిత్ షా, మోడీ  కాబట్టే  వాళ్ల కనుసన్నల్లోనే  నడుస్తున్నారని విమర్శించారు. జీడీపీ పెంచుతారు అనుకుంటే.. గ్యాస్, డీజీల్, పెట్రోల్‌‌ ధరలు  పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేటీఆర్, హరీశ్​ రావు చర్చకు రావాలని సవాల్​ విసిరారు.

ఏ ఊర్ల హామీ నెరవేర్చితే అక్కడే ఓటడగాలి

టీఆర్​ఎస్​ పార్టీ ఇచ్చిన హామీలు ఏఏ గ్రామాల్లో నెరవేర్చిందో ఆ గ్రామాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటడగాలని, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఏ గ్రామాలకైతే ఇచ్చామో అవే గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ ఓటడుగుతుందని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి సవాల్​ విసిరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్​ఎస్​ పార్టీ, కేసీఆర్​ గత ఏడేండ్లుగా డబుల్​ బెడ్​రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్​మెంట్​ లాంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు.  కాంగ్రెస్​ పార్టీ హయాంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇచ్చామని, అర్హులైన పేదలకు భూపంపిణీ చేశామని అన్నారు.