
- ఐటీడీఏ పీవో బి.రాహుల్
భద్రాచలం, వెలుగు : ఆదివాసీ మహిళలు తయారు చేసిస ఉత్పత్తులకు వారే సొంతంగా మార్కెటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో న్యూట్రిమిక్స్ ప్రొడక్ట్స్, మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్డూలు, సబ్బులు, షాంపూలు, ఇతర తినుబండారాలను ఐటీసీ అధికారుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా మహిళలు సొసైటీలుగా ఏర్పడి వారి ఉత్పత్తులు వారే అమ్ముకోవాలని సూచించారు. మహిళా స్వావలంబన కోసం ఐటీడీఏ ఆర్థికంగా సహకరిస్తుందని తెలపారు. దమ్మక్క జాయింట్ లయబులిటీ గిరిజన మహిళా గ్రూపు సభ్యులు కొత్తగా తయారు చేసిన మోవా, బ్యాంబో సోప్‌లను ఈ సమావేశంలో ఆవిష్కరించారు.
అనంతరం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో బంగారు పతకాలు సాధించిన కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ విద్యార్థులను పీవో బి.రాహుల్ తన చాంబరులో అభినందించారు. 15 సంవత్సరాల లోపు విద్యార్థులు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో బంగారు పతకాలతో పాటు జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు రిషివర్మ, వెంకన్నబాబులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారని, అక్కడ కూడా ప్రతిభ చూపితే చైనాలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే సువర్ణ అవకాశం వారికి వచ్చిందని తెలిపారు.