సోనియాగాంధీ ఆత్మకథపై విమర్శలు తగవు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సోనియాగాంధీ ఆత్మకథపై విమర్శలు తగవు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: సమాజంలోని ప్రతి మహిళను తల్లిగా చూడాలని చెప్పే ఆర్‌‌ఎస్‌‌ఎస్ నేతలు, సోనియా గాంధీని విమర్శించడం ఏమిటని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌‌లోని గాంధీ భవన్‌‌లో పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులకు ఆయన సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆత్మకథపై బీజేపీ, బీఆర్‌‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు.

పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన లేదంటూ బీఆర్‌‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. వినోద్ కుమార్ లాంటి సీనియర్ నేతలు ఇలాంటి చిల్లర విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘‘తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. ఆ విషయాన్ని ఆమె రాసుకోవాలా? లేక మనం రాసుకోవాలా?’’ అని ఆయన నిలదీశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని పొంది, ఆ ఫలాలను అనుభవిస్తున్న మనం ఆమె త్యాగం గురించి రాసుకోవడం కనీస మర్యాద అని హితవు పలికారు. 

అలాగే, బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్‌‌పై స్పందిస్తూ.. ఆమె అసలు రాజకీయ నాయకురాలే కాదన్నారు. సోనియా గాంధీని విమర్శించే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు. సోనియా గాంధీ జీవిత చరిత్రపై తాను సినిమా నిర్మించనున్నట్టు జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ డిసెంబర్ 9వ తేదీన సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులతో చర్చిస్తానని వెల్లడించారు.