జపాన్ ప్రధానమంత్రి సనే తకైచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలలకే పార్లమెంటు రద్దు చేశారు. దింతో జపాన్‌లో ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు రానున్నాయి. జపాన్ పార్లమెంట్ స్పీకర్ ఫుకుషిరో నుకాగా అధికారికంగా పార్లమెంటు సభ రద్దు లేఖను చదివి వినిపించారు. దీంతో 465 మంది సభ్యులున్న పార్లమెంట్ రద్దయింది. అలాగే 12 రోజుల పాటు జపాన్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగనుంది.
గత ఏడాది అక్టోబర్‌లో జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన తకైచికి ప్రస్తుతం 70 శాతం మంది ప్రజల మద్దతు ఉంది. ఈ క్రేజ్‌ను వాడుకుని, ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నేతృత్వంలోని ప్రభుత్వానికి పార్లమెంట్‌లో మెజారిటీ చాలా తక్కువగా ఉంది. ఈ ఎన్నికల ద్వారా పూర్తి మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు.
తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకుంటుందని తకైచి చేసిన వ్యాఖ్యలతో చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జపాన్‌ను మరిన్ని ఆయుధాలు కొనాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ఎన్నికలకు సిద్ధమయ్యారు.
ఎవరీ సనే తకైచి?
64 ఏళ్ల తకైచి జపాన్ రాజకీయాల్లో అత్యంత ప్రముఖ నాయకురాలు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అంటే ఆమెకు చాలా ఇష్టం. 1961లో పశ్చిమ జపాన్‌లోని నారా ప్రిఫెక్చర్‌లో జన్మించిన తకైచి రాజకీయ ప్రయాణం 1980లో డెమొక్రాట్ పాట్రిసియా ష్రోడర్ వాషింగ్టన్ కార్యాలయంలో పనిచేస్తుండగా ప్రారంభమైంది, ఆమె రెండు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణల కాలంలో జపాన్‌ను తీవ్రంగా విమర్శించింది.
ఆమె మొదట 1992లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది, కానీ తర్వాత సంవత్సరం గెలిచి 1996లో LDPలో చేరింది. అప్పటి నుండి ఆమె పదిసార్లు పార్లమెంటులో స్థానం సంపాదించుకుంది. ఇంటర్నల్ & సమాచార మంత్రి, ఆర్థిక మంత్రి, వాణిజ్య & పరిశ్రమల మంత్రి వంటి చాల సీనియర్ పదవులను చేపట్టింది. మూడు సార్లు ప్రయత్నించి ఎట్టకేలకు జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఆమె చరిత్ర సృష్టించారు.
