కేసీఆర్​పై పోటీకి.. ఉమ్మడి అభ్యర్థిని దించాలె : కోదండరాం

కేసీఆర్​పై పోటీకి.. ఉమ్మడి అభ్యర్థిని దించాలె :   కోదండరాం

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో కేసీఆర్​పై అన్ని పార్టీలు కలిపి ఉమ్మడిగా ఒకే అభ్యర్థిని బరిలో దించాలనేది గద్దర్ ఆలోచన అని టీజేఎస్ చీఫ్ కోదండ రాం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి కేసీఆర్​పై పోటీకి ఉమ్మడి అభ్యర్థిని దించాలని, ఇం దుకు అన్ని పార్టీలతో చర్చిస్తామని అన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలున్నా మళ్లీ సిట్టింగ్ లకే టికెట్లు ఇచ్చారని విమర్శించారు. అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి బయటపడుతోందన్నారు. గురువారం నాంపల్లిలోని పార్టీ ఆఫీస్​లో కోదండరాం మీడియాతో మాట్లాడారు. 

అంతకుముందు పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కోరిండు కాబట్టి కామారెడ్డిలో పోటీ చేస్తున్న అని సీఎం చెప్తున్నారని, 119 ఎమ్మెల్యేలు కోరితే 119 చోట్ల పోటీ చేస్తడా అని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేస్తుందని, తాను ఎక్కడ పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. దళితుల భూముల అంశంపై కాంగ్రెస్ నేత మల్లు రవి కలిశాడని, ఎన్నికల్లో పొత్తు అంశంపై చర్చ జరగలేదని చెప్పారు. 

వచ్చే నెలాఖరు నుంచి ఆందోళనలు

కేసీఆర్ అమలు చేయని హామీల మీద ఆందోళనలు చేపడతామని కోదండరాం వెల్లడించారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టులో రైతుల నుంచి బలవంతంగా భూ ములు లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై త్వరలో అన్ని పార్టీలు, ప్రజా సంఘా లతో కలిసి మీటింగ్ నిర్వహిస్తామన్నారు. దళితులకు కేటాయించిన భూములను లాక్కుని ప్రభుత్వం వేలం వేస్తోందని, మోకిల, బుద్వేల్​లో వేలం వేసినవి దళితుల భూములేనని అన్నారు. వచ్చే నెల 30 న సాగరహారం నిర్వహించిన రోజు సందర్భంగా హైదరాబాద్​లో మీటింగ్ పెట్టి కేసీఆర్ పాలన మీద రెఫరెండం విడుదల చేస్తామని కోదండరాం ప్రకటించారు.