భారత ఇంధన రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘శాంతి’ (SHANTI - Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India) బిల్లు 2025ను ప్రవేశపెట్టింది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే.. పాతబడిన అటామిక్ ఎనర్జీ యాక్ట్, 1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, 2010 రద్దవుతాయి. విదేశీ పెట్టుబడులకు ఆటంకంగా మారిన నిబంధనలను తొలగించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త నిబంధనలను కేంద్రం రూపొందించింది. అణుశక్తి నియంత్రణ మండలికి తాజా బిల్లు ద్వారా చట్టబద్ధమైన అధికారాలు లభిస్తాయి.
ప్రైవేట్ కంపెనీలకు బంపర్ ఆఫర్..
* భారతీయ ప్రైవేట్ కంపెనీలు న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించడానికి, నిర్వహించడానికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్ట్, స్టోరేజ్ అండ్ సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి-ఎగుమతుల్లో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది.
* అయితే అత్యంత సున్నితమైన యురేనియం ఎన్‌రిచ్మెంట్ , వ్యర్థాల రీప్రాసెసింగ్ వంటి అంశాలు మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి.
ఇన్వెస్టర్ల భయాలకు చెక్..
గతంలో న్యూక్లియర్ ప్రమాదం జరిగితే పరికరాల సరఫరాదారులపై కూడా బాధ్యత ఉండేది. దీనివల్ల విదేశీ కంపెనీలు పెట్టుబడులకు వెనుకాడేవి. కానీ కొత్త బిల్లు ప్రకారం.. ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ప్లాంట్ నిర్వహించే సంస్థదే. పరికరాల సరఫరాదారులకు ఎటువంటి బాధ్యత ఉండదు. గరిష్ట నష్టపరిహారాన్ని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 300 మిలియన్ SDRగా నిర్ణయించారు.
భారత్ 2070 నాటికి 'నెట్-జీరో' ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో అణు విద్యుత్ సామర్థ్యం 8.2 GW మాత్రమే ఉంది. దీనిని 2047 నాటికి 100 GWకు పెంచడమే తాజా బిల్లు లక్ష్యం. ఈ చట్టం ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ కేవలం విద్యుత్ రంగానికే కాకుండా.. వైద్యం, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.
