ఊపిరితిత్తుల(Lungs) క్యాన్సర్ గుర్తించే ప్రక్రియలో వైద్య రంగం ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. బ్రిటన్ పరిశోధకులు రక్తం ద్వారా క్యాన్సర్‌ను కనిపెట్టే కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కనిపెట్టడం కొంచెం ఆలస్యం అవుతుంటుంది. కానీ ఇప్పుడు FT-IR (Fourier Transform Infrared) అనే సాంకేతికతను ఉపయోగించి రక్తంలోని ఒకే ఒక్క క్యాన్సర్ కణాన్ని(single lung cancer cell ) కూడా వైద్యులు గుర్తించవచ్చు.
క్యాన్సర్ కొన్ని కణాలు విడిపోయి రక్తంలో తిరుగుతూ ఉంటాయి. వీటిని 'సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్' (CTCలు) అంటారు. ఇవి క్యాన్సర్ ఒక చోట నుండి మరో చోటికి వ్యాపించడానికి కారణమవుతాయి.
ప్రతి కణానికి ఒక ప్రత్యేకమైన రసాయన గుర్తు ఉంటుంది. ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను రక్త నమూనాపై ప్రసరింపజేసినప్పుడు, క్యాన్సర్ కణాలు ఆ కాంతిని గ్రహించే విధానం వేరుగా ఉంటుంది. ఈ మార్పులను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి, శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో నిమిషాల్లో చెప్పేయవచ్చు.
దీని వల్ల కలిగే లాభాలు ఏంటంటే వ్యాధి ప్రారంభ దశలోనే తెలిస్తే చికిత్స చేయడం సులభం అవుతుంది. ప్రస్తుతం ఉన్న పద్ధతులు చాలా ఖరీదైనవి ఇంకా క్లిష్టమైనవి. కానీ ఈ కొత్త పద్ధతిలో ల్యాబ్‌లలో సాధారణంగా వాడే గ్లాస్ స్లైడ్స్‌నే ఉపయోగిస్తారు, కాబట్టి ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంకా తక్కువ సమయంలో ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే మందులు వాడేటప్పుడు క్యాన్సర్ తగ్గుతుందో లేదో కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ పరిశోధన విజయవంతమైంది. త్వరలోనే దీనిని పెద్ద ఎత్తున రోగులపై పరీక్షించి, అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ పద్ధతిని కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కే కాకుండా, ఇతర రకాల క్యాన్సర్‌లను గుర్తించడానికి కూడా వాడవచ్చని ప్రొఫెసర్ జోసెప్ సులే-సుసో తెలిపారు.
