మహబూబ్‌నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా, 12 చోట్ల స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అమరచింత, గద్వాల, నారాయణపేట, అలంపూర్ పురపాలికల్లో మాత్రం ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో పలు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానుండగా.. మిగతా చోట్ల ఇండిపెండెంట్ల మద్దతుతో పార్టీలు చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఈ క్రమంలో కొత్తగా గెలుపొందిన కౌన్సిలర్లను ప్రధాన పార్టీల లీడర్లు కౌంటింగ్ సెంటర్ల నుంచే నేరుగా క్యాంప్‌లకు తరలించారు. ఏ ఒక్కరూ గోడ దూకినా చైర్మన్ పీఠాలు చేజారే అవకాశాలు ఉండడంతో ముందస్తుగా వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లను తమకు మద్దతుగా నిలవాలని బేరసారాలకు దిగుతున్నారు.
అమరచింతలో పది వార్డులుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడేసి కౌన్సిలర్ స్థానాలను దక్కించుకున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం ఒక స్థానంలో గెలిచింది. ఈ రెండు పార్టీలు అలయెన్స్ కావడంతో వారి బలం నాలుగుకు చేరింది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.కూడా అలయెన్స్ అయ్యేందుకు చర్చించుకుంటున్నట్లు తెలిసింది.
అలంపూర్ మున్సిపాలిటీలో పది వార్డులుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఐదేసి స్థానాలు గెలుచుకోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నట్లు భావిస్తున్నారు.
గద్వాలలో 37 వార్డులుండగా కాంగ్రెస్ 17, కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఒక స్థానంలో గెలిచింది. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ 11, బీజేపీ ఏడు, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. అయితే ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒక కౌన్సిలర్ మాత్రమే కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారు. మరో కౌన్సిలర్ ఎవరికి మద్దతు ఇచ్చేది స్పష్టం చేయడం లేదు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ అలయెన్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
