ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ దే : మంత్రి వాకిటి శ్రీహరి

ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ దే : మంత్రి వాకిటి శ్రీహరి
  •     మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: బీజేపీ నాయకులు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్​ను గెలిపించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తాను చేయని తప్పుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చ చేశారని, దీని ప్రభావం ఒక్క కాంగ్రెస్​ అభ్యర్థి మీద కూడా పడలేదన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని మంత్రి క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో బీజేపీ తనపై, పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు కాంగ్రెస్​ను అదరించారన్నారు. తన తప్పు ఉంటే ఆ ప్రభావం ఈ ఎన్నికల మీద పడేదన్నారు. ఎంత దుష్ప్రచారం చేసిపా తాను చేయని తప్పుకు కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ మక్తల్ కు వచ్చారన్నారు. పార్లమెంట్  బయట, లోపల ఎంత  హడావుడి చేసినా ఏమి  చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచి మున్సిపల్  పీఠం కైవసం చేసుకుందన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డితో పాటు తనను ప్రజలు నమ్మి మక్తల్, అత్మకూర్​లో మెజార్టీ సీట్లు అందించారని తెలిపారు. ఈ గెలుపుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో అభివృద్ధి జరగలేదని అందుకే మక్తల్​లో బీఆర్ఎస్  ఖాతా తెరవలేదన్నారు. మున్సిపల్​ చైర్​పర్సన్​ ఎవరనే విషయాన్ని పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అనంతరం కొత్తగా గెలుపొందిన కౌన్సిలర్లు మంత్రి కలవగా, వారిని మంత్రి అభినందించారు. బాలకృష్ణారెడ్డి, చంద్రకాంత్​ గౌడ్, రవికుమార్​ పాల్గొన్నారు.