ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడే వారి పేర్లు రాసి పెట్టుకొని వారి సంగతి తేలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూరులోని ప్రమిదా గార్డెన్స్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచులను సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్మాసిటీ కాదు ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి రంగుల కలలు చూపిస్తున్నారని విమర్శించారు.
న్యూయార్క్‌ను తలదన్నే నగరాన్ని నిర్మిస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూదందా జరుగుతోందని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించిన భూములను వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులు, అనుచరులు పెద్ద ఎత్తున భూములు కొన్నారన్నారు. కేసీఆర్ హయాంలో 16 లక్షల ఎకరాలు నిషేధిత భూ జాబితాలో ఉండగా, ప్రస్తుతం లక్ష ఎకరాలు మాత్రమే ఉంచారని విమర్శించారు. పేదల భూములను లాక్కుంటూ పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారన్నారు.
కోహెడలో ఫ్రూట్ మార్కెట్‌కు బీఆర్ఎస్ హయాంలో భూములు కేటాయిస్తే, ఇప్పుడు మార్కెట్ కోసం గుట్టల్లోకి వెళ్లమంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
