ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్.. ఆయన అహంకారంతోనే బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్: మంత్రి వివేక్

 ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్.. ఆయన అహంకారంతోనే బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్: మంత్రి వివేక్

 

  • కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టిన్రు
  • దోచుకున్న డబ్బు కోసమే కేసీఆర్​ ఫ్యామిలీలో లొల్లి 
  • గోదావరి పుష్కరాల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నమని వెల్లడి
  • చెన్నూరులో గోదావరి నది పుష్కరఘాట్ ​సందర్శన

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ​హయాంలో కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్​ ఫ్యామిలీ రూ.కోట్లు దోచుకుందని, వాళ్ల అవినీతి మొత్తం బయటపడుతుందని తెలిపారు. కేటీఆర్​ ఫ్రస్ట్రేషన్​తో మాట్లాడుతున్నాడని.. అతని​అహంకారంతోనే బీఆర్ఎస్​ గ్రాఫ్​ పడిపోయిందన్నారు. సోషల్​ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో మంత్రి వివేక్​ వెంకటస్వామి పర్యటించారు. వరద ప్రభావానికి గురైన మందమర్రి పట్టణంలోని చెంచుకాలనీ సందర్శించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులను ఆదుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం చెన్నూరు పట్టణ సమీపంలో గోదావరి నది ఉత్తరవాహిని ప్రాంతంలో గల పుష్కరఘాట్ ను కలెక్టర్ ​కుమార్​ దీపక్​తో కలిసి సందర్శించారు. 

మంత్రి మాట్లాడుతూ.. గత   ప్రభుత్వ హయాంలో కేసీఆర్​కుటుంబం ప్రజలకు మేలు చేయకుండా కేవలం కమీషన్ల కోసమే పనులు చేపట్టి.. ఖజానా ఖాళీ చేసిందన్నారు.  కేటీఆర్​అహంకార ధోరణి, నాయకత్వలోపం కారణంగా బీఆర్​ఎస్​ బ్రష్టుపట్టిందని.. అందుకే ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ఓడించి గట్టిబుద్ధి చెప్పారన్నారు. ఫార్ములా ఈ రేస్​ లొట్టపీసు కేసు అంటున్న కేటీఆర్.. విచారణకు ఎందుకు భయపడుతున్నాడని   ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి.. దోచుకున్న డబ్బు కోసం కేటీఆర్, కవిత, హరీశ్​రావు లొల్లిపెట్టుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 
బాగాలేనప్పటికి తమ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదన్నారు.  సమస్య ఏదైనా అందుబాటులో ఉంటానని.. కాకా స్ఫూర్తితో ప్రజా సేవ చేస్తానని చెప్పారు.

గోదావరి పుష్కరాల కోసం ముందస్తు చర్యలు..

మంచిర్యాల జిల్లాలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి వివేక్​ పేర్కొన్నారు. చెన్నూరు వద్ద  గోదావరి నది ఉత్తరవాహిని ప్రాంతం కావడంతో ఈసారి పుష్కరాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని,   పది లక్షల మంది వస్తారని అంచనాతో పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి, కలెక్టర్​కు వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్యక్రమంలో జైపూర్​ఏసీపీ వెంకటేశ్వర్లు, మందమర్రి మున్సిపల్​ కమిషనర్​ తుంగపిండి రాజలింగు, మందమర్రి, చెన్నూరు సీఐలు శశీధర్​రెడ్డి, దేవేందర్,  తదితరులు పాల్గొన్నారు. 

గిగ్​ వర్కర్లకు మినిమం వేజెస్​కు కృషి..

గిగ్ వర్కర్స్ కు వేతన భద్రత కల్పిస్తూ  గిగ్ వర్కర్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేందుకు వచ్చే కేబినెట్ లో చర్చిస్తామని మంత్రి వివేక్​ అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు స్థానిక ఎన్నికల నిర్వహణ పై కూడా చర్చ ఉంటుందని చెప్పారు. కోల్​బెల్ట్​ ప్రాంతంలో కొత్త బొగ్గు గనులు వస్తేనే సింగరేణి కంపెనీ మనుగడ ఉంటుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. వేలంలో పాల్గొని ఒడిశా రాష్ట్రంలో గనిని దక్కించుకున్న సింగరేణి ఇక్కడి గనుల కోసం వేలంలో పాల్గొంటుందన్నారు.