హైదరాబాద్‌‌‌‌లోని కూకట్‌‌‌‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఐదుగురు మృతి

హైదరాబాద్‌‌‌‌లోని కూకట్‌‌‌‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఐదుగురు మృతి
  • నిమ్స్‌‌‌‌లో ఇద్దరు, ప్రైవేట్ ​హాస్పిటళ్లలో మరో ఇద్దరు, గాంధీలో ఒకరు.. 
  • నిమ్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటున్న ఇంకో 29 మంది 
  • ఐసీయూలో 17 మంది.. ఆరుగురి పరిస్థితి విషమం
  • మెరుగైన​ ట్రీట్‌‌‌‌మెంట్​ ఇవ్వాలని హెల్త్​ మినిస్టర్​ దామోదర ఆదేశం 
  • బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి
  • నాలుగు కల్లు కాంపౌండ్స్‌‌‌‌ సీజ్.. పోలీసుల అదుపులో నిర్వాహకులు

కూకట్‌‌‌‌పల్లి/పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని కూకట్‌‌‌‌పల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో సీతారాం(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65), స్వరూప(61), మౌనిక(25) ఉన్నారు. కూకట్‌‌‌‌పల్లి ప్రాంతంలోని కల్లు దుకాణాల్లో సోమవారం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను మంగళవారం స్థానిక రాందేవ్​ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిమ్స్, గాంధీ దవాఖానలకు తరలించారు. మంగళవారం 15 మంది నిమ్స్‌‌‌‌లో అడ్మిట్​ కాగా, బుధవారానికి ఆ సంఖ్య 31కి చేరింది. వీరిలో ఇద్దరు చనిపోయారు.  ప్రస్తుతం నిమ్స్‌‌‌‌లో 29 మంది ట్రీట్‌‌‌‌మెంట్ పొందుతుండగా, 17 మంది ఐసీయూలో ఉన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. 

రెండ్రోజులుగా అస్వస్థత!
కూకట్‌‌‌‌పల్లిలోని ఉషా ముళ్లపూడి రోడ్డులో, ఎల్లమ్మ బండ ప్రాంతం, కేపీహెచ్‌‌‌‌బీ హైదర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగిన వారికి సోమవారం ఉదయం నుంచే వాంతులు, విరేచనాలు అయినట్టు తెలుస్తోంది. ఇందులో 15 మంది స్థానిక రాందేవ్​ దవాఖానకు వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఎల్లమ్మబండకు చెందిన మౌనిక బుధవారం మధ్యాహ్నం కన్నుమూసింది. బొజ్జయ్య, నారాయణమ్మ నిమ్స్‌‌‌‌లో,  సీతారాం గాంధీలో బుధవారం చనిపోయారు.

హైదర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే స్వరూప రెండు రోజుల క్రితమే కల్లు తాగి వాంతులు, విరేచనాలతో నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్​దవాఖానలో చేరింది. ఈమె కూడా బుధవారం ఉదయం చనిపోయింది. ఇది తెలుసుకున్న కల్లు కాంపౌండ్ ఓనర్.. స్వరూప మృతి విషయాన్ని గోప్యంగా ఉంచి కుటుంబసభ్యులతో దహన సంస్కారాలు చేయించడానికి విఫలయత్నం చేశాడు. అయితే సమాచారం అందుకున్న కేపీహెచ్‌‌‌‌బీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు.

కాగా, వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాంకు భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మేస్త్రీగా పని చేస్తున్నాడు. కల్తీ కల్లు వల్లే తన భర్త చనిపోయాడని అనిత ఆరోపిస్తున్నది. మరోవైపు గాంధీ దవాఖాన నుంచి బాధితులు విజయ్, కృష్ణయ్యను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సీతారాంను గాంధీకి తీసుకువచ్చేటప్పుడే చనిపోయాడని, అతని మరణానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని, పోస్టుమార్టంలో వివరంగా తెలుస్తాయని డాక్టర్లు అంటున్నారు.  

మరింత మంది బాధితులు
కూకట్‌‌‌‌పల్లి పరిసర ప్రాంతాల్లోని పలు ప్రైవేటు దవాఖానల్లో కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. దీంతో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిమ్స్​లోనే 29 మంది ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. ఇందులో సంగమణి, బాలమణి, ప్రమీల, గోవిందమ్మ, లక్ష్మి, కోటేశ్వరరావు, పోచవ్వ, మోనప్ప, రాములు, యాదగిరి, పెంటేష్, దేవదాసు, యోబు, మాధవి, నర్సింహ, సాయిలు, కృష్ణ, విజయ్​, సత్యనారాయణ, పి.గోవిందమ్మ, వెంకటమ్మ, శేఖర్​, బి.లక్ష్మి, ఎ.సత్తిబాబు, ఎస్.పెంటమ్మ, ఎస్.సుధాం, డి.యాదమ్మ, టి.ఎల్లమ్మ, అలివేలు, శివ, వెంకటేష్​ఉన్నారు. వీరిలో దేవదాసు, యోబు, నర్సింహ, మాధవి  పరిస్థితి  విషమంగా ఉంది. 17 మంది ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆరుగురు ఐసీయూలో ఉండగా, మిగతా వాళ్లు గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో ఉన్నారు. 

నాలుగు కల్లు కాంపౌండ్స్​ సీజ్​
కల్తీ కల్లు విక్రయించినట్టు భావిస్తున్న భాగ్యనగర్​కాలనీ, హెచ్ఎంటీహిల్స్, హైదర్‌‌‌‌‌‌‌‌గర్, సర్దార్​పటేల్​నగర్‌‌‌‌‌‌‌‌లోని నాలుగు కల్లు కాంపౌండ్స్‌‌‌‌ను ఎక్సైజ్​అధికారులు సీజ్ చేశారు. కేసులు నమోదు చేసిన కేపీహెచ్​బీ పోలీసులు.. కల్లు కాంపౌండ్స్​నిర్వాహకులు నగేశ్​గౌడ్​, శ్రీనివాస్​గౌడ్​, కుమార్​గౌడ్​, టి.శ్రీనివాస్​గౌడ్​, తీగల రమేష్‌‌‌‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఓనర్లు పరారీలో ఉన్నట్టు తెలిసింది.  అలాగే, నగరంలోని పలు కల్లు కంపౌండ్లపై ఎక్సైజ్​పోలీసులు దాడులు చేశారు. 674 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు.   

నిమ్స్‌‌‌‌కు మంత్రి జూపల్లి..
 నిమ్స్​లో చికిత్స పొందుతున్న బాధితులను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి పరామర్శించారు. అనంత‌‌‌‌రం ఆయన మీడియాతో మాట్లాడారు. విషయం తెలిసిన వెంటనే ఎక్సైజ్, పోలీసు సిబ్బంది స్పందించి బాధితులను హుటాహుటిన హాస్పిట‌‌‌‌ల్స్ కు త‌‌‌‌ర‌‌‌‌లించార‌‌‌‌ని చెప్పారు. ‘‘స‌‌‌‌కాలంలో ట్రీట్​మెంట్​అంద‌‌‌‌డంతో బాధితులంద‌‌‌‌రూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య ప‌‌‌‌రిస్థితి నిల‌‌‌‌క‌‌‌‌డ‌‌‌‌గా ఉంది. ఘ‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌పై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు  కేసు న‌‌‌‌మోదు చేసి ద‌‌‌‌ర్యాప్తు చేస్తున్నారు” అని తెలిపారు. కాగా, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్​డైరెక్టర్​బీరప్పను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర ఆదేశించారు.