
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు గోదావరికి వరద ఉదృతి పెరుగుతోంది. దీంతో ములుగు జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాజేడు మండలం టేకులగూడెం వంతెన పై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ములుగు జిల్లా నుంచి చత్తీస్ ఘడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ ఛత్తీస్ ఘడ్ జాతీయ రహదారి 163 పై వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఫ్లై ఓవర్ ముఖద్వారం దగ్గర బారికేడ్ లతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గోదావరి సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని చెప్పారు., ఇరురాష్ట్రాల ప్రజలు ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే కాళేశ్వరం మీదుగా వెళ్లాలని ములుగు జిల్లా పోలీసులు చెప్పారు.
►ALSO READ | నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారం..
మరో వైపు జూలై 11 సాయంత్రం 6 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 37.2 అడుగులకు చేరింది. అధికారులు అంచనాల ప్రకారం నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.