మానేరు తీరాన.. మస్త్ ​జోష్​ ఆకట్టుకున్న కల్చరల్ ​ప్రోగ్రామ్స్​

మానేరు తీరాన.. మస్త్ ​జోష్​ ఆకట్టుకున్న కల్చరల్ ​ప్రోగ్రామ్స్​

కరీంనగర్, వెలుగు: కేబుల్​ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో మానేరు తీరంలో మస్త్​ జోష్​ నెలకొంది. కరీంనగర్‌‌లో కేబుల్​ బ్రిడ్జిని బుధవారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌‌తో కలిసి మంత్రి కేటీఆర్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్​ప్రోగ్రామ్స్​ ఆకట్టుకున్నాయి. బోస్కో, దుబాయి ఎల్ఈడీ డ్యాన్సర్ల ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేశాయి. డ్యాన్సర్ నాగదుర్గ, సింగర్స్ మధుప్రియ ఆటపాటలు అలరించాయి. గులాం వర్షి ఖవాళీ ఆకట్టుకుంది. 80 మంది డ్యాన్సర్లు ఒకేసారి చేసే నృత్యంతో షో పూర్తయింది. కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్ తర్వాత సుమారు 20 నిమిషాలపాటు ఆగకుండా పేల్చిన థౌజండ్ వాలా, ఫైవ్ థౌజండ్ వాలా క్రాకర్ షోతో ఆకాశం కలర్ ఫుల్‌గా మారింది. కార్యక్రమానికి మంత్రి గంగుల జన సమీకరణ చేసినప్పటికీ సాయంత్రం చిరుజల్లులు కురవడంతో ప్రారంభంలోనే వేలాది మంది మహిళలు వెనుదిరిగారు. 

రివ్యూ మీటింగ్‌లు, ప్రారంభోత్సవాలు

కరీంనగర్​పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్​పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.2 కోట్ల ఎల్ఆర్ఎస్ నిధులతో  ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంటర్, కొత్త కౌన్సిల్ హాల్, ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. బల్దియా ఆఫీసులో రివ్యూ మీటింగ్​ నిర్వహించి కార్పొరేటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,  డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, కమిషనర్ ఇస్లావత్ సేవా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.