- నిరుపయోగంగా కరీంనగర్ పద్మానగర్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్
- కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించి రేపటికి ఏడాది
- డంపింగ్ యార్డ్ ఖాళీపై నెరవేరని కేంద్ర మంత్రి హామీ
- అమలుకాని 24/7 తాగునీటి సరఫరా స్కీమ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. ఏడాది కింద ప్రారంభించిన మరికొన్ని నిర్మాణాలు ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. సరిగ్గా ఏడాది కింద కరీంనగర్ పద్మానగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, తెలంగాణ చౌక్‌లో మల్టీ పర్పస్ పార్క్, అంబేద్కర్ స్టేడియంలోని స్టోర్ట్స్ కాంప్లెక్స్, శాతవాహన యూనివర్సిటీ, సివిల్ హాస్పిటల్ ఏరియాలో స్ట్రీట్ వెండర్స్ కోసం కేటాయించిన షట్టర్లు, హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 తాగునీటి సౌకర్యాన్ని కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇందులో పార్కు మినహా మిగతా పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డంపింగ్ యార్డును క్లియర్ చేసేందుకు కేంద్రం నుంచి నిధులిస్తామని కేంద్ర మంత్రి ఖట్టర్ ఇచ్చిన హామీ ఏడాదైనా నెరవేరలేదు. ఈ డంపింగ్ యార్డు అంశం వచ్చే ఎన్నికల్లో నాలుగైదు డివిజన్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
పద్మానగర్ మార్కెట్‌పై స్ట్రీట్ వెండర్స్ అనాసక్తి
కరీంనగర్ పద్మానగర్ లో రూ.16.50 కోట్లతో నిర్మించిన వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభించడానికి ముందే 114 వెజిటేబుల్స్, 12 ఫ్రూట్స్, 12 ఫ్లవర్స్, 26 నాన్ వెజ్ స్టాల్స్‌తో పాటు 22 షట్టర్స్ కలిపి మొత్తం 193 స్టాళ్లకు లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులకు కేటాయించారు. అన్ని హంగులతో మార్కెట్‌ను ప్రాంభించారు. కానీ చాలా మంది అడ్వాన్స్ డిపాజిట్ చెల్లించేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం కేవలం ఐదారుగురు తప్ప ఇందులో వ్యాపారాలు నిర్వహించడం లేదు. మరోవైపు ఆ మార్కెట్ కు కొనుగోలుదారులు రాకపోవడంతో వారు కూడా నిరాశకు గురవుతున్నారు. దీంతో మార్కెట్ లో కంటే రోడ్ల మీదే కూరగాయలు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కోట్లు వెచ్చించి నిర్మించినా మార్కెట్ ఏడాదికాలంగా నిరుపయోగంగా మారింది.
24/7 తాగునీటి సరఫరా ఫెయిల్
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రతిష్టాత్మకంగా రూ.18 కోట్లతో చేపట్టి ప్రారంభించిన 24/7 తాగునీటి సరఫరా ఫెయిలైంది. ఎప్పుడూ నల్లా తిప్పినా నీళ్లు రావాల్సి ఉండగా.. పాత పద్ధతిలోనే రోజూ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నీళ్లు వదిలి బంద్ చేస్తున్నారు. సిటీ అంతా చేపట్టాలనుకున్న ఈ స్కీమ్.. పైలట్ ప్రాజెక్టు దశలోనే ఫెయిల్ కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బల్దియాకు రూ.లక్షల్లో కిరాయి లాస్
యునాని హాస్పిటల్ స్థలంలో నిర్మించిన కాంప్లెక్స్ లో పాస్‌పోర్టు ఆఫీసును ఆరు నెలల కింద ఖాళీ చేశారు. ఈ ఆఫీసు స్థలంతోపాటు మరో 6 షాపులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మున్సిపల్ ఆఫీసును ఆనుకుని ఐడీఎస్ఎంటీ స్కీం కింద నిర్మించిన 10 షాపులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. అలాగే చైతన్యపురి మీ సేవ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంది. వీటన్నింటికి వేలం నిర్వహించాల్సి ఉన్న ఆఫీసర్లు పట్టించుకోవం లేదు. దీంతో అద్దె రూపంలో రావాల్సిన రూ.లక్షలాది సొమ్ము రావడం లేదు.
