మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించండి

మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించండి
  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాశ్మీర్‌‌ వర్సిటీలో తెలుగు విద్యార్థుల లేఖ
  • అధికారులతో మాట్లాడిన మంత్రి.. 23 మంది విద్యార్థుల తరలింపు

న్యూఢిల్లీ, వెలుగు: భారత్ – పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌‌లోని షేర్– ఇ–-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన సాంకేతిక యూనివర్సిటీ (ఎస్‌కేయూఏఎస్టీ)లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కాశ్మీర్‌‌లోని యుద్ధ ప్రాంతం నుంచి తమను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఏపీ, తెలంగాణ, తమిళనాడు విద్యార్థులు లేఖ రాశారు. పాకిస్తాన్ దాడులతో ఎయిర్‌‌పోర్టులు మూసివేశారని, బయటకు తిరిగే పరిస్థితి లేదన్నారు. 

‘‘మేం యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయాం. వర్సిటీల్లో పరిస్థితి ఆందోళనకరంగా, భయానకంగా ఉంది. విమాన సేవలు నిలిచిపోవడంతో ఇక్కడి నుంచి బయట పడలేకపోతున్నాం. ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని వెంటనే తరలించి, ఆదుకోండి’’అని లేఖలో అభ్యర్థించారు. స్టూడెంట్ల విజ్ఞప్తిపై స్పందించిన బండి సంజయ్ నేరుగా వారితో ఫోన్‌లో మాట్లాడారు. 

అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్‌కేయూఏఎస్టీ వర్సిటీ డీన్‌తో మాట్లాడి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి సూచనతో జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం 23 మంది విద్యార్థులను కాశ్మీర్ నుంచి బస్సులో ఢిల్లీ, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురు, ఏపీ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నారు.

సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకున్న 35 మంది విద్యార్థులు..

పాకిస్తాన్‌ సరిహద్దు రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరికోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేయగా.. సుమారు 40 కాల్స్‌ను భవన్ అధికారులు రిసీవ్‌ చేసుకున్నారు. శుక్రవారం నుంచి సుమారు 35 మంది తెలంగాణ విద్యార్థులు భవన్‌కు చేరుకున్నారు. వారితో భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ప్రత్యేకంగా మాట్లాడి సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవన్‌లోనే విద్యార్థులకు హెల్త్ చెకప్, ఉచిత బస, భోజనం, రాకపోకల కోసం వెహికల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.