- అసలు ఓనర్‌కు తెలియకుండానే క్రయవిక్రయాలు
- సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కు
- కీసరలో ఆరుగురు నిందితులు అరెస్ట్
కీసర, వెలుగు: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో ఖాళీగా ఉన్న ప్లాట్లను కబ్జా చేసి, నకిలీ పత్రాలతో విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేటకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి దొప్పలపూడి రవీంద్రకు చెందిన 300 గజాల ప్లాట్‌ను నకిలీ లింక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేశారన్న ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డి, సబ్-రిజిస్ట్రార్రెహమాన్తో కుమ్మక్కై, అసలు యజమానులకు తెలియకుండా ప్లాట్లకు నకిలీ యజమానులను సృష్టించి పలుమార్లు క్రయవిక్రయాలు జరిపారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమాలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ కేసులో జంగాల శ్రీరామ్, జీవీఆర్ ఇన్ప్రాకు చెందిన గుబ్బల వెంకటేశ్వరరావు, బందెల్ల ప్రశాంత్, ప్రభాకర్, బాలకృష్ణ తోపాటు డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ రెహమాన్‌ను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. రెహమాన్ కీసరకు బదిలీ అయ్యి ఏడాది కాలం దాటినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంస్స్కు పోలీసులు లేఖ రాశారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకున్న జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయలు, దర్యాప్తు అధికారి ఎస్ఐ అనిల్ కుమార్, కీసర పోలీస్ సిబ్బందిని డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
