న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. శుక్రవారం (నవంబర్ 28) ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 384కి చేరుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) డేటా ప్రకారం ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగించడంపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ లేవనెత్తారు. వాయు కాలుష్యం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు కొనుగోలు చేసే ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘‘స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులు. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో గాలి ప్రాణాంతకంగా మారింది. అయినప్పటికీ పరిష్కారాలను అందించే బదులు ప్రభుత్వం ప్రజలపై పన్ను విధిస్తోంది. ప్రజలు కాలుష్యం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేస్తారు. కానీ ఎయిర్ ప్యూరిఫైయర్ల 18 శాతం జీఎస్టీ విధిస్తూ కేంద్రం ప్రజలు జేబులకు చిల్లు పెడుతోంది. ఇది పూర్తిగా అన్యాయం. గాలి, నీరు శుద్ధి చేసే యంత్రాలపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజలకు పరిష్కారం అందించలేనప్పుడు కనీసం వాళ్లపై ఆర్ధిక భారాన్ని అయినా ఆపండి’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కేజ్రీవాల్.
శీతాకాలంతో పాటు ఇటీవల ఇథియోపియాలో విస్ఫోటనం చెందిన హైలీ గుబ్బా అగ్నిపర్వత బూడిద కారణంగా ఢిల్లీలో వాయి నాణ్యత దారుణంగా క్షీణించింది. శుక్రవారం (నవంబర్ 28) చాందినీ చౌక్ (408), జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (401), బురారీ క్రాసింగ్ (403) , మందిర్ మార్గ్ (320), ఐటిఓ (393), నజాఫ్‌గఢ్ (365), సిరి ఫోర్ట్ (394), శ్రీ అరబిందో మార్గ్ (354) వంటి ప్రధాన ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (AQI) నమోదైంది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కృతిమ వర్షాలు కురిపించాలని ప్లాన్ చేసిన అది విఫలమైంది.
