
కేరళలో ఒక కొత్త వ్యాధి ఇప్పుడు ప్రజలను భయపెడుతుంది. ఈ వ్యాధి చాల అరుదైన వ్యాధి అయినప్పటికీ గత కొన్ని రోజులుగా పెరుగుతున్న మరణాలు అలాగే ఈ వ్యాధి బారిన పడిన కేసులు పెరుగుతుండటంతో కేరళ వైద్యశాఖా అత్యవసర ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. కేవలం ఒక ఆగష్టు నెలలోనే కేరళలో ఐదుగురు ఈ అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ సోకి మరణించారు. ఈ వైరస్ పేరు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్.
తాజాగా, మలప్పురం జిల్లాలోని వండూర్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ శోభన కోజికోడ్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈమె మరణించిన రెండు రోజుల ముందు, అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుల్తాన్ బతేరీకి చెందిన 45 ఏళ్ల రతీష్ కూడా ఇదే ఇన్ఫెక్షన్‌తో మరణించాడు. రతీష్‌కు గుండె సమస్యలు కూడా ఉన్నాయని ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఈ ఇద్దరి మరణాలతో ఆగస్టు నుండి ఇప్పటివరకు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న మరో 11 మంది ప్రస్తుతం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనే ఈ ఇన్ఫెక్షన్ కలుషితమైన నీటిలో జీవించే అమీబా అయిన నేగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుంది.
ఈ వ్యాధి చికిత్సకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ వైద్యులకు ప్రత్యేక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ ఇన్ఫెక్షన్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించదని, కానీ కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు సోకుతుంది. అది కూడా స్విమ్మింగ్, డైవింగ్ చేయడం లేదా ఇన్ఫెక్షన్ సోకిన నీటిలో స్నానం చేయడం ద్వారా వ్యాపిస్తుంది.
ఈ వ్యాధిని ఆరోగ్య అధికారులు చాల తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 42 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి, ఇది సాధారణంగా చాలా అరుదుగా ఉండే వ్యాధి అయినప్పటికీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది, దీనివల్ల తీవ్రమైన మెదడు వాపు అలాగే చాలా సందర్భాలలో ప్రాణాంతకం అవుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో నీరు తక్కువగా ఉండే లేదా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అమీబా వృద్ధి చెందే నీళ్లలో ఇంకా చెరువులలో ఈత కొట్టకూడదని ఆరోగ్య సలహాదారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధికి సంబంధించి నీటిని శుభ్రంగా అలాగే క్లోరినేట్ చేశారని చూసుకోవాలని ఇంకా స్నానం చేసేటప్పుడు ముక్కు నుండి నీరు శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలని ఆరోగ్య నిప్పులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదకరమైన మెదడు వ్యాధి: ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనేది చాలా అరుదుగా వచ్చే ఒక ప్రమాదకరమైన మెదడు వ్యాధి. దీనిని "మెదడును తినే అమీబా" అని కూడా అంటారు. ఈ వ్యాధికి నేగ్లేరియా ఫౌలేరి అనే సూక్ష్మజీవి కారణమవుతుంది.
వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలాగ ఉంటాయి. అందుకే ఈ వ్యాధిని గుర్తించడం కష్టం. ఇన్ఫెక్షన్ సోకిన 1 నుంచి 9 రోజులలో లక్షణాలు బయటపడతాయి.
*తీవ్రమైన తలనొప్పి
*జ్వరం
*వాంతులు
*మెడ పట్టేయడం
*కళ్ళు తిరగడం
PAM వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. దీనికి చికిత్స ఉన్నప్పటికీ ఈ వ్యాధి సోకిన వాళ్లలో 97% కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు. లక్షణాలు కనిపించిన తర్వాత కొన్ని రోజుల్లోనే చనిపోతుంటారు.