
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతు దారులు దాడి చేశారు. ఆలయ గోడలపై వ్యతిరేక నినాదాలురాశారు. భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. అంతేకాదు ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను అమరవీరుడని పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆలయ పూజారి, భక్తులు ఫోన్ చేసి ఈ విషయాన్ని తమకు తెలియజేశారని శ్రీ లక్ష్మీ నారాయణ్ టెంపుల్ ప్రెసిడెంట్ సతీందర్ శుక్లా తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరి 12,16 తేదీల్లో విక్టోరియాలోని కారమ్ డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణు దేవాలయం, మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాశారు. 2022లో కెనడాలోనూ హిందూ దేవాలయంపై కూడా దాడి జరిగింది.
జనవరి 15 2023 సాయంత్రం ఖలిస్తాన్ మద్దతుదారులు మెల్‌బోర్న్‌లో కార్ ర్యాలీ నిర్వహించారు. తమ ఉద్యమానికి మద్దతివ్వాలని ర్యాలీ చేశారు. అయితే ఈ ర్యాలీలో 60వేల మంది ఉన్న మెల్బోర్న్ కమ్యూనిటీలో కేవలం రెండు వందల కంటే తక్కువ మంది హాజరయ్యారు.