విదేశాల్లో ‘కిల్ ఇండియా’ పోస్టర్లు

విదేశాల్లో ‘కిల్ ఇండియా’ పోస్టర్లు
  • రేపు ఖలిస్తాన్ మద్దతుదారుల ర్యాలీ
  • యూఎస్, కెనడాలోనూ పాంప్లెంట్లు
  • తీవ్రంగా ఖండిస్తూ కెనడా, బ్రిటన్ లకు అభ్యంతరం తెలిపిన కేంద్రం ​ 

న్యూఢిల్లీ: విదేశాల్లో ఖలిస్తాన్ అనుకూల శక్తుల నిరసనలు, హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. తాజాగా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లోని ఇండియన్ దౌత్యవేత్తలు టార్గెట్​గా ఖలిస్తానీ శక్తులు పోస్టర్లు అంటించాయి. శనివారం (జులై 8) మూడు దేశాల్లోని​ ఇండియన్ హైకమిషన్ల ఎదుట నిరసనలకు ఖలిస్తానీ అనుకూల వర్గాలు ప్లాన్​ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ‘కిల్​ఇండియా’ అంటూ పోస్టర్లు వేశాయి. ఈ చర్యలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ధోరణులు తమకు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ఇండియా వ్యతిరేక పోస్టను ఖండిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయాన్ని కాన్సుల్​జనరల్​ఆఫ్ ​ది ఎంబసీ ఆఫ్ లండన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. భావ వ్యక్తీకరణ పేరిట ఉగ్రవాద శక్తులకు అవకాశం ఇవ్వబోమని చెప్పారు. ‘‘ఇది భావవ్యక్తీకరణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. హింసకు పురిగొల్పడం, వేర్పాటువాదాన్ని సపోర్ట్​ చేయడం, ఉగ్రవాదానికి మద్దతు కూడగట్టడం వంటి అంశాలను భావవ్యక్తీకరణ పేరుతో దుర్వినియోగం చేయడమే’’ అని అన్నారు. ఇండియన్ దౌత్యవేత్తలు, ఇతర సిబ్బంది, ఆఫీసుల సెక్యూరిటీ తమకు అత్యంత ముఖ్యమైన అంశమని బాగ్చి స్పష్టం చేశారు.

ఇండియా విమర్శలు సరికాదు: ట్రూడో 

ఓటు బ్యాంకు కోసం ఖలిస్తానీ అనుకూల శక్తులు చేస్తున్న ఇండియా వ్యతిరేక, హింసాత్మక చర్యల పట్ల కెనడా మెతక వైఖరి అవలంబిస్తున్నదంటూ చేసిన విమర్శలు సరికాదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. భారత విదేశాంగ చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియా అడిగిన ప్రశ్నలపై జస్టిన్ ట్రూడో స్పందించారు. టెర్రరిజం, హింస  పట్ల  కెనడా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అవి ఏ రూపంలో ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు. తమది చాలా భిన్నమైన దేశమని, రకరకాలు సంస్కృతుల వారు ఇక్కడ నివసిస్తున్నారని, వారందరి వాక్ స్వాతంత్ర్యాన్ని తాము సపోర్ట్ చేస్తామని చెప్పారు.

సిఖ్స్ ఫర్ జస్టిస్​​ స్థాపకుడు పన్ను మృతి?

ఇండియన్ మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్, సిఖ్స్ ఫర్ జస్టిస్​ వ్యవస్థాపకుడు గురుపత్వంత్​ సింగ్ పన్ను మరణించినట్లు సోషల్​మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఖలిస్తానీ వర్గాలు ఈ వార్తలను తోసిపుచ్చుతున్నారు. పన్ను మృతి వార్తలు నిజం కాదని అమెరికాలో ‘కల్సా టు డే’ ను నడిపిస్తున్న చాహల్ వెల్లడించారు. కాగా, పన్ను పై ఇండియాలో 22 క్రిమినల్​ కేసులు ఉన్నాయి.