సీతారామ పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలి : అనుదీప్ దురిశెట్టి

సీతారామ పెండింగ్ భూ సేకరణ పూర్తి చేయాలి : అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి
  • ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్ష 
  • యాతాలకుంట ద్వారా జనవరి నాటికి నీరు విడుదల చేయాలని అధికారులకు ఆదేశం

ఖమ్మం టౌన్, వెలుగు :  సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పెండింగ్​ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సీతారామ ఎత్తిపోతల పథకంపై అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటిపారుదల శాఖ ఎస్ఈ పూర్తి స్థాయిలో వివరించారు.  

అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి 507 ఎకరాల అటవీ భూమి బదులుగా, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు చేపట్టాలని సూచించారు. ప్యాకేజి 13 పరిధిలో  చేపట్టనున్న 10 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి అవసరమైన 167 ఎకరాల పట్టా భూముల అవార్డు పాస్ చేసి నెల రోజుల లోపు భూ బదలాయింపు పూర్తి చేయాలని ఆదేశించారు. 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు భూ సేకరణ, అటవీ సమస్యల వల్ల  వేగంగా జరగడం లేదని, వీటిని అధిగమించి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రతిపాదనలు ఫైనల్ చేయాలని చెప్పారు. 

 డిస్ట్రిబ్యూటర్ కాల్వల భూ సేకరణ సర్వే పనుల కోసం సర్వేయర్లను డిప్యూటేషన్ పై తీసుకురావాలని, అదనపు బృందాలు ఏర్పాటు చేసి సర్వే వేగంగా 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిని ఇకనుంచి ప్రతీ 15 రోజులకు ఒకసారి రివ్యూ చేయనున్నట్లు తెలిపారు. 

భూ సేకరణకు సంబంధించిన చెల్లింపులు డిప్యూటీ సీఎం, మంత్రి సహకారంతో సకాలంలో పూర్తి చేస్తామన్నారు. యాతాలకుంట ద్వారా జనవరి నాటికి నీరు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాతాలకుంట వద్ద పనులు పూర్తి చేస్తే సత్తుపల్లి నియోజక వర్గానికి గోదావరి జలాలు చేరతాయని చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కొత్తగూడెం ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు , నీటిపారుదల శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, 
రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

వారం రోజుల్లో సర్వే పూర్తి చేయాలి

ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వే ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన సర్వేపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 571 గ్రామాల్లో ఇప్పటి వరకు 69 శాతం (30,434) మేరకు సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. పెండింగ్ 13,663 ఇండ్ల సర్వే ప్రక్రియ మరో వారం రోజుల్లో100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో  వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీ గార్డ్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు.