- సీసీఐకి నేరుగా పత్తి విక్రయిస్తే మద్దతు ధర
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- వానాకాలం పంటల కనీస మద్దతు ధరపై వాల్పోస్టర్, పాంప్లేట్స్ఆవిష్కరణ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి బుధవారం వానాకాలం పంటల కనీస మద్దతు ధరపై వాల్పోస్టర్, పాంప్లేట్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025–-26లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పంటలకు సంబంధించిన మద్దతు ధరలను ప్రకటించిందన్నారు.
ప్రతీ క్వింటాల్ గ్రేడ్ ఏ రకం సన్న వడ్లకు రూ.2,389లతో పాటు 500 బోనస్, సాధారణ రకం ధాన్యానికి 2,369, పత్తి (పొడవు గింజ) రూ.8,110, పత్తి (మధ్యస్థ గింజ) రూ.7,710, మొక్కజొన్నకు రూ.2,400, కందులకు రూ.8 వేలు, పెసళ్లకు రూ.8,768, వేరుశనగ కాయలకు రూ.7,263, మినుములు రూ.7,800, పొద్దు తిరుగుడుకు రూ.7,721, సోయాబీన్ కు రూ.5,328, నువ్వులకు రూ.9,846, సజ్జలు రూ.2,775, రాగులకు రూ.4,886 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు.
రైతులు స్థానిక మార్కెట్ యార్డులో తమ పంటను కనీస మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తిని విక్రయించి మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోని పత్తి విక్రయానికి నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. పత్తి కొనుగోలు సంబంధిత సేవలకు 1800 599 5779 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా సహకార అధికారి గంగాధర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనాలి..
రికార్డు స్థాయిలో పంట కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా విషయమై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషన్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని సూచించారు. ఖమ్మం జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద డ్రైయర్ లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న మ్యానువల్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలన్నారు.
టార్ఫాలిన్ కవర్లు ప్రతి కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో పెట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులను ముందస్తుగానే అందుబాటులో ఉంచాలని, 10 లక్షల గన్నీబ్యాగుల అదనపు కేటాయింపుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రతిరోజు క్షేత్ర స్థాయి పురోగతి వివరాల రిపోర్టు రూపంలో అందించాలని తెలిపారు.
సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం....
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–-26 విద్యాసంవత్సరానికి 5 నుండి 9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 17న సాయంత్రం 5 గంటల లోగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమరించాలని పేర్కొన్నారు.
రోడ్ల రిపేర్లు వెంటనే చేపట్టాలి
కొత్తగా నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయడంతో పాటు, ఉన్న రోడ్ల రిపేర్లు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రోడ్ల నిర్వహణపై రోడ్లు, భవనాల శాఖ, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి ఆయన సమీక్షించారు. ఇటీవల వర్షాలకు రహదారులు చాలా చోట్ల దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే రిపేరు చేయాలని చెప్పారు.
జిల్లా కేంద్రం ప్రవేశం వద్ద రోడ్లు దెబ్బతిని ఉన్నాయని, నగర పరిధిలోని రోడ్ల నిర్వహణ నగరపాలక సంస్థ చేపడుతుందన్నారు.అల్లిపురం, వెలుగుమట్ల తదితర ప్రదేశాల్లో విద్యుత్ స్తంభాల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. సమీక్షలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకుబ్, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసాచారి, నేషనల్ హైవే పీడీ రామాంజనేయ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈలు పవార్, తానేశ్వర్, నేషనల్ హైవే ఈఈ యుగంధర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
