- ఐదేండ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లెక్కింపు..
- సిబ్బందికి శిక్షణ ఇస్తున్న ఆఫీసర్లు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో చిన్న నీటి వనరుల లెక్క తేల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదేండ్లకోసారి చేసే సర్వేలో భాగంగా ఈ ఏడాది బోర్లు, బావులు, లిఫ్టులు, కుంటలు, చెరువులు, చెక్ డ్యాముల సంఖ్యను లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడవ విడత మైనర్ ఇరిగేషన్ సర్వేతో పాటు, రెండవ విడత వాటర్బాడీ సెన్సెస్ ను కూడా కలిపి చేయనున్నారు.
జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో) పర్యవేక్షణలో జరిగేఈ సర్వే కోసం మండల ప్రణాళిక గణాంకాధికారులకు(ఎంపీఎస్ఓ) శిక్షణ పూర్తి కాగా, వచ్చే వారం నుంచి లెక్కింపు ప్రారంభించనున్నారు. గతంలో 2017, 18లో ఈ సర్వే జరిగిన సమయంలో పేపర్లలో ఈ వివరాలను నమోదు చేయగా, ఈసారి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రతి చిన్న నీటి వనరులని ‘ఎంఐ సెన్సెస్’ యాప్లో నమోదు చేయడంతో పాటు జియో ట్యాగింగ్ చేయనున్నారు. దీని వల్ల ఎలాంటి పొరపాట్లు, తప్పులకు అవకాశం లేకుండా లెక్క కరెక్ట్ గా రానుంది.
లెక్కించేది ఇలా..
దేశవ్యాప్తంగా ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఐదేండ్లకోసారి చిన్న నీటి వనరులను లెక్కిస్తారు. చివరిసారిగా 2017–18 సంవత్సరంలో చేసిన సర్వే నివేదికను కేంద్ర ప్రభుత్వం 2023లో విడుదల చేసింది. ఈ డేటాను ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి పారుదల పథకాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాయి. ఖమ్మం జిల్లాలో 380 రెవెన్యూ గ్రామాలున్నాయి. రెవెన్యూ గ్రామానికి ఒక ఎన్యూమరేటర్ ను ఎంపిక చేసుకొని, వారి సహకారంతో సర్వే పూర్తి చేస్తారు.
ఎన్యూమరేటర్లుగా ఏఈవోలు గానీ, జీపీవోలు గానీ, పంచాయతీ సెక్రటరీలు గానీ, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు గానీ సర్వేలో పాల్గొంటారు. బోర్లు, బావులు, నీటి కుంటలు, చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెక్ డ్యాముల లాంటి చిన్న నీటి వనరులన్నింటినీ ఈ సర్వేలో గుర్తించనున్నారు. వీటితో పాటు ఎప్పుడు తవ్వారు, ఎంత లోతు తవ్వారు, డయా మీటర్ ఎంత, ఎంత ఖర్చయింది, వీటికి ఏ విద్యుత్ వాడుతున్నారు, నీటిని సాగుకోసమే ఉపయోగిస్తున్నారా, తాగునీటికి వాడుతున్నారా, చెరువులు, కుంటలు అయితే వాటి పారకం ఎంత, ఏఏ పంటలు సాగవుతున్నాయి,.. ఇలా వివరాలను సేకరించనున్నారు.
వీటిని నేరుగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్ ల ద్వారా యాప్ లోనే ఎంట్రీ చేస్తారు. ప్రతి ఎన్యూమరేటర్ కు ఒక లాగిన్ ఐడీని కేటాయించి, ఓటీపీ ద్వారా యాప్ లో లాగిన్ అవకాశం కల్పిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను మండల స్టాటిస్టికల్ ఆఫీసర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు పర్యవేక్షించనున్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లెక్క ప్రకారం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 1,061 కుంటలు, చెరువులు ఉన్నాయి.
