ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ

ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి :  అడిషనల్ కలెక్టర్ శ్రీజ
  • నామినేషన్ల స్వీకరణకు మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ 

ఖమ్మం టౌన్, వెలుగు :  నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్, టీమ్ ల ఏర్పాటు, తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీలు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరణకు మండల కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అవసరమైన మేర కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. 

మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ మద్దతు ఎంపీడీఓలకు అందించాలని సూచించారు. ప్రతి మండలంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు.  ఎన్నికల విధుల పట్ల అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండేలా శిక్షణ అందించాలన్నారు.  ఈనెల 6న మొదటి దశ ర్యాండమైజేషన్ తర్వాత డ్యూటీ అలాట్ చేయనున్నట్లు చెప్పారు.

ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ ఓటర్లకు, పీడీ యాక్ట్ కింద అరెస్టు అయిన వారికి, ఎన్నికల విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయనున్నట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు, ఓటర్ జాబితా వివరాలు సంబంధిత పోటీ చేసే అభ్యర్థులకు సమాచారం అందించాలన్నారు.

 నామినేషన్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఎటువంటి ర్యాలీ, ప్రచారాలు అనుమతి లేవని, అభ్యర్థితో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే పట్టుకుని సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, అదనపు డీఆర్డీవో జయశ్రీ, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.