రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. కేసీఆర్ అవినీతిపై విచారణ: కిషన్​రెడ్డి

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. కేసీఆర్ అవినీతిపై విచారణ: కిషన్​రెడ్డి
  • బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతం: కిషన్​రెడ్డి
  • ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తం
  • మాఫియాను బుల్డోజర్లతో అణచివేస్తం
  • బీసీ సీఎం నిర్ణయాన్ని జనం స్వాగతిస్తున్నరు
  • వచ్చే నెల 3 నుంచి ప్రచారాన్ని ఉధృతం చేస్తం
  • ప్రచారంలో మోదీ, అమిత్ షా, నడ్డా, 
  • రాజ్​నాథ్, గడ్కరీ, యోగి పాల్గొంటరని వెల్లడి
  • బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లెల ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత నారాయణ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబ అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గ్రామ పంచాయతీ నుంచి మొదలు సీఎంవో వరకు అవినీతిని అంతం చేస్తామని చెప్పారు. అక్రమ వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపుతామని, హైదరాబాద్ లో మాఫియాను యూపీలో యోగి ప్రభుత్వం మాదిరిగా బుల్డోజర్లతో అణచివేస్తామని హెచ్చరించారు. 

ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో గద్వాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరిలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఇంద్రకరణ్ రెడ్డి, మంథని బీఆర్ఎస్ నేత చల్లా నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను కేసీఆర్​ మోసం చేస్తున్నారని, బీఆర్​ఎస్​ను ఫామ్ హౌస్​​లోనే పాతరేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 ‘‘మత రిజర్వేషన్ల పేరుతో బీసీలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్​ది. పదేండ్లుగా ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర బీఆర్ఎస్​ది” అని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే.. అందులో 37 సీట్లను మజ్లిస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ల పేరుతో ఎత్తుకుపోయిందని, దీని వల్ల అనేక జిల్లాలో బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేస్తున్నదని కిషన్​రెడ్డి ఫైర్​ అయ్యారు. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

 ‘‘మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అసదుద్దీన్​ ఒవైసీ పర్మిషన్ ఉంటేనే.. బీఆర్ఎస్ మంత్రులు ఓల్డ్ సిటీలో పర్యటించే పరిస్థితి ఉంది. మజ్లిస్ అనుమతి లేకుండా నాడు కాంగ్రెస్ మంత్రులు, నేడు బీఆర్ఎస్ మంత్రులు పాతబస్తీలో పర్యటించలేని దుస్థితి. ఓల్డ్ సిటీలో మజ్లిస్ సానుభూతిపరులు కరెంటు బిల్లులు, నీటి బిల్లులు కట్టడం లేదు. వీటి వసూళ్ల కోసం అక్కడికి వెళ్లే ప్రభుత్వ అధికారులపై కత్తులతో బెదిరించి రౌడీయిజం చేస్తున్నరు” అని ఆయన మండిపడ్డారు. 

బీసీ సీఎం.. చరిత్రాత్మక నిర్ణయం

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అమరవీరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా సకలజనుల పాలనను అందిస్తామని, ఫాంహౌస్​లో పడుకునే సీఎం ఉండరని, రోజుకు 16 గంటలు ప్రజల కోసం పనిచేసే సీఎంని ప్రజల ముందుంచుతామని కిషన్​ రెడ్డి చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీని సీఎం చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకమన్నారు. ‘‘ఇది సామాజిక విప్లవంతో కూడిన నిర్ణయం. అనేక సంవత్సరాలుగా బీసీలకు సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు జరిగాయి. కానీ అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు బీసీలను మోసం చేశాయి. 

తెలంగాణలో బీసీని సీఎం చేయాలని బీజేపీ నిర్ణయించడంపై గ్రామాల్లో కూడా బీసీ సామాజిక వర్గ ప్రజలు, సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశాయి. జాతీయ బీసీ కమిషన్​కు చట్టబద్ధత కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే” అని తెలిపారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్​ మోసం చేశారని, కాని బీజేపీ మాట ఇస్తే తప్పే పార్టీ కాదన్నారు. వచ్చే నెల 3  నుంచి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఉధృతం చేస్తుందని చెప్పారు. మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్​తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రచారంలో  పాల్గొంటారని కిషన్ రెడ్డి వెల్లడించారు. 

కర్నాటక అక్రమ సొమ్ముతో కాంగ్రెస్​ కుట్రలు

కర్నాటకలో అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలను తెలంగాణకు తరలించి.. ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చుచేసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్​ కుట్రలు చేస్తున్నదని కిషన్​రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​ను తరిమికొట్టాలని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్  గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అక్కడి  ప్రజలను దగా చేసిందని దుయ్యబట్టారు.  ‘‘కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్  వేరు కాదు.. జై తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చి చంపించిన దుర్మార్గ పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్.. మోసాలు, దగా చేసే పార్టీ. 

ధరణి నుంచి మొదలు ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు కాంగ్రెస్ తరహాలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ ప్రజల రక్తాన్ని తాగుతున్నది. సంపద దోచుకుంటున్నది” అని ఆరోపించారు. కుటుంబ పాలనపై, అవినీతిపై మోదీ యుద్ధం ప్రకటించారని తెలిపారు.