కొప్పర్రు రాళ్లదాడి ఘటన..15మంది అదుపులో ఉన్నారు

కొప్పర్రు రాళ్లదాడి ఘటన..15మంది అదుపులో ఉన్నారు
  • గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని

గుంటూరు: పెదనందిపాడు మండలం కొప్పర్రులో ఇరువర్గాల ఘర్షణకు బాధ్యులైన 15మంది పోలీసుల అదుపులో ఉన్నారని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ధృవీకరించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నిన్న రాత్రి కొప్పర్రు గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తుండగా.. ఒకపార్టీ వారు జెండా ఊపారని ఆరోపిస్తూ మరో పార్టీ వారు వాగ్వాదానికి దిగడం ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో మూడు బైకులను తగులబెట్టడం ఉద్రిక్తత సృష్టించింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టి అదుపు చేశారు. ఘటనకు కారకులైన 15మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసులు నమోదు చేశారు. కాగా ఘటనపై జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందిస్తూ.. చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా  విచారణ జరపాలని ఆదేశించామని తెలిపారు. విచారణ నిష్పక్షపాతంగా జరిపేందుకు క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోందని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.