- డీఎంఎఫ్టీ ఫండ్స్ రూ. 10కోట్లు సాంక్షన్
- అన్ని హంగులతో.. పక్కా ప్రణాళికతో నిర్మాణం..
- ఇక పాల్వంచ బస్టాండ్ బిల్డింగ్ నిర్మాణానికీ నిధుల కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని వెల్లడి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని బస్టాండ్కు మంచిరోజులు రానున్నాయి. ఇన్నాళ్లు వానొస్తే డిపో మేనేజర్ ఆఫీస్‌తో పాటు బిల్డింగ్ చాలా వరకు కురిసేది. బస్టాండ్ ఆవరణ గుంతలమయంగా మారింది. దీంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. ఈ క్రమంలో శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న బస్టాండ్ స్థానంలో రూ.10 కోట్లతో కొత్త బిల్డింగ్ నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రాంలో కొత్తగూడెం బస్టాండ్కు డీఎంఎఫ్టీ కింద రూ. 10కోట్లు సాంక్షన్ చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్. బలరాంతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొనడంతో నగర వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగూడెం బస్టాండ్‌తో పాటు పాల్వంచ బస్టాండ్ నిర్మాణానికి ఫండ్స్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పాత బిల్డింగ్.. గత పాలకులు పట్టించుకోలే..
కొత్తగూడెం నగరం నడిబొడ్డున ఉన్న బస్టాండ్ భవనం దాదాపు ఐదు దశాబ్దాల కిందటి నిర్మించినది. కొన్నేండ్లుగా సమస్యలతో సతమతమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ ఉన్నారు. అప్పుడు పలుమార్లు కొత్తగూడెం బస్టాండ్‌ను సందర్శించారు.. అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు కానీ, అమలు మాత్రం చేయలేదు. బస్టాండ్ అభివృద్ధిలో భాగంగా రూ. 80లక్షలు కేటాయిస్తున్నట్టుగా అప్పటి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది.
మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు వచ్చి ఎస్టిమేషన్లంటూ హడావుడి కూడా చేశారు. కానీ ఫండ్స్ రిలీజ్లో మొండి చేయి చూపింది. దీంతో ఏంచేసేది లేక శిథిలావస్థ బస్టాండ్‌లోనే ఆర్టీసీ యాజమాన్యం నెట్టుకొస్తోంది. చిన్నపాటి వర్షానికే బస్టాండ్ నిండిపోతోంది. డిపో మేనేజర్ ఆఫీస్ రూంతో పాటు అన్ని రూంలు పైకప్పు లీకేజీలు అవుతున్నాయి. కొన్నిచోట్ల స్లాబ్ పెచ్చులూడుతోంది. బస్టాండ్ ఆవరణలో అన్ని గుంతలు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
టాయిలెట్స్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. రోజూ దాదాపు 25 వేల నుంచి 29వేల మంది ప్రయాణికులు ఈ బస్టాండ్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు రూ. 13లక్షల ఆదాయం వస్తోంది. 62బస్సులు ఈ డిపో నుంచి తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులు ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం బస్టాండ్ అభివృద్ధికి డీఎంఎఫ్టీ కింద సింగరేణి రూ. 10కోట్లు సాంక్షన్ చేసింది. త్వరలో కొత్తగూడెం బస్టాండ్ అన్నివసతులతో కొత్తగా కనిపించనుంది.
సింగరేణి సీఎండీ, కలెక్టర్ సహకారం మరువలేనిది..
కొత్తగూడెం బస్టాండ్ అభివృద్ధికి డీఎంఎఫ్టీ కింద రూ. 10కోట్లు సాంక్షన్ చేయడంలో కృషి చేసిన సింగరేణి సీఎండీ బలరాంతో పాటు కలెక్టర్ జితేశ్‌కు కృతజ్ఞతలు. జిల్లా కేంద్రంలో బస్టాండ్ శిథిలావస్థలో ఉన్న విషయమై పలుమార్లు సీఎంతో పాటు మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చాను. ఫండ్స్ కోసం సింగరేణి సీఎండీని కలిశాను. బస్టాండ్ అభివృద్ధికి రూ. 16కోట్లు అవసరం, మొదటి దశలో రూ. 10కోట్లను డీఎంఎఫ్టీ కింద ఫండ్స్ సాంక్షన్ అయ్యాయి. - కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే, కొత్తగూడెం
