Asia Cup 2025: సంజు పనికి రాడు.. 14 ఏళ్ళ కుర్రాడిని ఆసియా కప్‌లో ఓపెనింగ్‌కు పంపండి: కృష్ణమాచారి శ్రీకాంత్

Asia Cup 2025: సంజు పనికి రాడు.. 14 ఏళ్ళ కుర్రాడిని ఆసియా కప్‌లో ఓపెనింగ్‌కు పంపండి: కృష్ణమాచారి శ్రీకాంత్

అబుదాబి, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఆసియా కప్ 2025లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. భారత జట్టుకు పోటీనిచ్చే జట్లు కనిపించడం లేదు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 28న జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది. ఈ కాంటినెంటల్ టోర్నీకి మంగళవారం (ఆగస్టు 18) భారత జట్టును ప్రకటించనున్నారు. ఆసియా కప్ లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ దిగడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. వీరి చోటుపై ఎవరికీ సందేహాలు లేవు.  

గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్ లో అద్భుతంగా రాణించడమే ఇందుకు కారణం. అయితే భారత మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఓపెనింగ్ లో కొత్త కాంబోని సూచించాడు. యుఎఇలో జరగనున్న ఆసియా కప్ లో టీమిండియా ఓపెనింగ్ గురించి తన అభిప్రాయాన్ని తెలిపాడు. సంజు సామ్సన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించకూడదని శ్రీకాంత్ సూచించాడు. శాంసన్ కు బదులుగా సాయి సుదర్శన్, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లలో ఒకరిని అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేయాలని చెప్పాడు. ఇందుకు గల కారణం కూడా శ్రీకాంత్ వివరించాడు. 

"ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ లో షార్ట్ బాల్‌ను ఎదుర్కోవడానికి సంజు సామ్సన్ ఇబ్బందిపడ్డాడు. నా అభిప్రాయం ప్రకారం, శాంసన్ ఓపెనింగ్ చేయడం సందేహమే. నేను సెలెక్టర్ అయితే, అభిషేక్ శర్మ నా మొదటి ఎంపిక. అతనితో పాటు నేను వైభవ్ సూర్యవంశీ లేదా సాయి సుదర్శన్‌ను ఎంచుకుంటాను. నా 15 మంది సభ్యుల టీ20 ప్రపంచ కప్ జట్టులో వైభవ్ సూర్యవంశీ కూడా ఉంటే బాగుండు. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. అతను చాలా బాగా రాణిస్తున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా మంచి ఎంపిక". అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ 'చీకీ చీకా'లో అన్నారు.

ఐపీఎల్ 2025 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ళ వయసులోనే 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన యూత్ వన్డే సిరీస్ లోనూ అదరగొట్టాడు. ఇక సాయి సుదర్శన్ ఈ సీజన్ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జైశ్వాల్ ఇప్పటికే భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. మరోవైపు 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా దుమ్ములేపారు. వీరిద్దరూ 30 ఇన్నింగ్స్‌లలో 157.09 స్ట్రైక్ రేట్‌తో 33.62 సగటుతో 908 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.