శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారానికి మరో డేట్ ఇవ్వండి: కేటీఆర్

శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారానికి మరో డేట్ ఇవ్వండి: కేటీఆర్

శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తనకు మరో తేదీని  ప్రకటించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. దురదృష్టవశాత్తు మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయానని..ఈ కార్యక్రమానికి హాజరు కాని మిగతా ఎమ్మెల్యే తోపాటు ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీ సెక్రటరీని మరో తేదీని ప్రకటించాలని కోరానని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ రోజు( డిసెంబర్ 9) జరిగిన బీఆర్ ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కాలేదు కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి, కేటీఆర్ తండ్రి అయిన కేసీఆర్ తుంటి ఎముక విరిగి హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో కేసీఆర్ వెంటే ఉన్న కేటీఆర్.. అటు శాసనసభా ప్రమాణ స్వీకారానికి , ఇటు బీఆర్ ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కాలేకపోయారు. 

మరోవైపు మూడో అసెంబ్లీ సమావేశానికి ముందు తెలంగాణ భవన్ లో బీఆర్ ఎస్ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభలో బీఆర్ ఎస్ ఎల్పీ నేతగా తిరిగి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును  ప్రతిపాదించగా తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపర్చారు.