అభివృద్ధి చేయలేని లీడర్లు రాజీనామా చేయాలె

అభివృద్ధి చేయలేని లీడర్లు రాజీనామా చేయాలె
  • బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్/అలంపూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఆయన మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్​లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చేయలేని ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు రైతులను వరి వేయొద్దనుడేందని ప్రశ్నించారు. సమస్యలను పక్కనపెట్టి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒక స్టేట్​మెంట్.. కేసీఆర్ ఇంకో స్టేట్​మెంట్ ఇస్తూంటే రైతులు ఇబ్బందులు పడ్తున్నారని అన్నారు. ఖరీఫ్ పంటల్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

‘‘అలంపూర్​ టౌన్​లో నేను చదివిన స్కూల్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేదు. దక్షిణ కాశీగా చెప్పుకునే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సౌలత్​లు లేక భక్తులు ఇబ్బందులు పడ్తున్నారు”అని అన్నారు. అలంపూర్​ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేదంటే ఇక్కడి ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 
దొంగ హామీ ఇచ్చి నమ్మించిన్రు
ఉద్యమ సమయంలో ఏ వర్గం కూడా వాళ్లను సీఎం చేయాలని అడగలేదని, సీఎం కేసీఆరే దొంగ హామీ ఇచ్చి నమ్మించి బుట్టలో వేసుకున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీపై కేసీఆర్ కామెంట్స్ మేరకు ప్రవీణ్​ కుమార్ ట్వీట్ చేశారు. ‘‘మమ్మల్ని సీఎం చేయండి సారూ అని అడుక్కునేటోడు బానిస. పోరాటం చేసి సీఎం కుర్చీ గుంజుకునేటోడు బహద్దూర్​’’ అని పేర్కొన్నారు. ‘దళితుడిని సీఎం చేస్తనన్న.. ఔను.. చేయలే ’ అని ‘వెలుగు’ పేపర్​లో వచ్చిన వార్త క్లిప్పింగును ప్రవీణ్​ షేర్​ చేశారు.