గెలిచేవాళ్లెవరు?.. అభ్యర్థుల వేటలో పార్టీల లీడర్లు

గెలిచేవాళ్లెవరు?..  అభ్యర్థుల వేటలో పార్టీల లీడర్లు
  • స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం 
  • సురక్షిత స్థానాల వైపు ఆశావహుల చూపు 
  • గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ 
  • ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో సందడి కనిపిస్తోంది. బతుకమ్మల సందడి, దేవీ నవరాత్రుల ఉత్సవాలు, దసరా పండుగల నేపథ్యంలో ఇప్పటికే పల్లెటూర్లు కళకళలాడుతున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగాలంటూ వేర్వేరు కారణాలతో సమీపంలోని పట్టణాల్లో నివసించే వారంతా ఊర్లకు చేరుతున్నారు. ఇదే సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలను ఆఫీసర్లు ప్రకటించడంతో పెద్దల నుంచి వృద్ధుల వరకు ఎలక్షన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. 

రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో పోటీ చేసేందుకు ద్వితీయ శ్రేణి లీడర్లు సమాయత్తం అవుతుండగా, మరోవైపు ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు పార్టీకి కట్టుబడి పనిచేసే ముఖ్య కార్యకర్తలను ఎలక్షన్ల బరిలోకి దించేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామంటూ పార్టీల నుంచి సంకేతాలు ఉండడంతో ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకొని పార్టీ టికెట్ ను కన్ఫామ్ చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు ఎన్నికల విధులపై దృష్టిపెట్టారు. 

జిలాలో స్థానాలు, ఎన్నికల నిర్వహణ ఇలా.. 

ఖమ్మం జిల్లాలో 20 మండలాలుండగా, 261 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 571 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 5214 వార్డులున్నాయి. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10 మండలాల చొప్పున రెండు దశలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఇక జీపీల్లో 183 గ్రామాలకు మొదటి దశలో, 196 గ్రామాలకు రెండవ దశలో, 192 గ్రామాలకు మూడో దశలో ఎన్నికలు జరుగుతాయి. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 22 మండలాలుండగా, 233 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 471 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 4168 వార్డులున్నాయి. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 11 మండలాల చొప్పున రెండు దశలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఇక జీపీల్లో మొదటి విడతలో నిమిది మండలాల్లో 159 గ్రామపంచాయతీలకు, రెండో  దశలో ఏడు మండలాల్లోని 156గ్రామపంచాయతీలకు, మూడో దశలో ఏడు మండలాల్లోని 156 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.

ఏర్పాట్లు షురూ.. 

ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. సిబ్బందికి ఎన్నికల విధుల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు పూర్తిగా తొలగించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ప్రతి మండలం పరిధిలో సర్వేలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నారు.

ఆ స్థానాలే కీలకం..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జడ్పీ చైర్మన్ పీఠం జనరల్ కు కేటాయించారు. జిల్లాలో 22 జడ్పీటీసీలకు గానూ బీసీలకు ఏడు, జనరల్ కు నాలుగు స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జడ్పీ చైర్మన్​పై కన్నేసిన పలువురు ఆశావహులు బీసీ, జనరల్ స్థానాలైన భద్రాచలం, ములకలపల్లి, కరకగూడెం, జూలూరుపాడు, సుజాతనగర్, ఇల్లెందు, చర్ల, ఆళ్లపల్లి, టేకులపల్లి, దుమ్ముగూడెం, గుండాల జడ్పీటీసీల్లో పోటీ చేసే అంశంపై పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అనుకూలతలు, ప్రతికూలతలపై సమీక్షిస్తున్నారు.