కౌంట్ డౌన్ .. మరికొన్ని గంటల్లో నామినేషన్లు స్టార్ట్

కౌంట్ డౌన్ ..  మరికొన్ని గంటల్లో నామినేషన్లు స్టార్ట్

హైదరాబాద్:  లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి మరికొన్ని గంటలే టైం ఉంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. దేశ వ్యాప్తంగా  ఏడు దశల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నాలుగో దశలో రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు  ఈసీ సిద్దమైంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల  ప్రక్రియ సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లలో క్యాండిడేట్లను ఖరారు చేయాల్సి ఉంది.

 ఇవాళ రాత్రి వరకు ఈ మూడు సెగ్మెంట్లలో క్యాండిడేట్లను ప్రకటించేందుకు పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. రేపు మఖ నక్షత్రంతో కూడిన చైత్ర శుద్ధ దశమితోపాటు గురువారం కావడంతో చాలా మంది నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రేపు(18న) కాంగ్రెస్  మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, భువనగిరి క్యాండిడేట్ చామల కిరణ్​ కుమార్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 19వ తేదీన పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేరోజు మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. ముఖ్యంగా 18,19,12 తేదీల్లో నామినేషన్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది. 

పెండింగ్ స్థానాలకు లైన్ క్లియర్!

కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టిన స్థానాలకు ఇవాళ రాత్రి కల్లా క్లియరెన్సు వచ్చే అవకాశం ఉంది. కరీంగనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపుగా క్యాండిడేట్లు ఎవరనేది ఫైనల్ అయ్యిందని సమాచారం. ప్రకటించడమే తరువాయి అని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో 2.95 కోట్ల మంది ఓటర్లు

తెలంగాణలో మొత్తం 2,95,30,838 మంది ఓటర్లు ఉన్నారు.  వీరిలో 1,48,42,582 మంది పురుషులు, 1,46,74,217 మంది మహిళలు, 2,089 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే   నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు సాగనుంది. 

  • నామినేషన్లు   ఏప్రిల్ 18 నుంచి 25 వరకు 
  • స్క్రట్నీ     ఏప్రిల్ 26, 2024
  • ఉపసంహరణలు    ఏప్రిల్ 29, 2024
  • పోలింగ్        మే 13
  • ఫలితాల ప్రకటన    జూన్ 04,2024
  • ఎన్నికల ప్రక్రియ ముగింపు    జూన్ 06, 2024