Healthy Breakfast : కమ్మగా కొర్ర ఇడ్లీ.. ఇది తింటే ఎంతో బలం..!

Healthy Breakfast :  కమ్మగా కొర్ర ఇడ్లీ.. ఇది తింటే ఎంతో బలం..!

శరీరానికి మేలు చేసే తృణ ధాన్యాల్లో 'కొర్రల'ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు జొన్నలు, సజ్జలు, రాగులు.. లాగే వీటిని ఎక్కువగా తినేవారు. అయితే, తర్వాత కాలంలో కొర్రల వాడకం తక్కువైంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న చిరుధాన్యాలలో కొర్రలు ఆరవ స్థానంలో ఉన్నాయి. 

సెటారియా ఇటాలికా జాతికి చెందిన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామందికి వీటితో అన్నం వండుకోవడమే తెలుసు. అయితే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే కొర్రలతో వెరైటీ గా ఇడ్లీ తయారు చేసుకొని బ్రేక్​ ఫాస్ట్​ లో లాగిస్తే ఎంతో బలంగా ఉంటారు. ఈ స్టోరీలో కొర్ర ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. . .! 

వంద గ్రాముల కొర్రల్లో ప్రొటీన్లు  12 గ్రాములు, ఫైబర్: 8గ్రాములు, కొవ్వు: 6.8 గ్రాములు, ఐరన్ 3 గ్రాములు, మినరల్స్ 110 గ్రాములు, కాల్షియం: 31 గ్రాములు క్యాలరీస్ 47.3 గ్రాములుంటాయి.

కొర్ర ఇడ్లీ తయారీకి కావలసినవి

  • కొర్ర బియ్యం: 3 కప్పులు
  •  మినప్పప్పు: 1 కప్పు 
  • మెంతులు: 1 టేబుల్ స్పూన్
  •  ఉప్పు :సరిపడా 
  • నూనె: 1టేబుల్ స్పూన్ 
  • అల్లం: కొంచెం 
  • శెనగపప్పు : 1టీస్పూన్

తయారీ విధానం : కొర్ర బియ్యం, మినపప్పును వేర్వేరుగా ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టాలి. వాటికి మెంతుల్ని కూడా కలిపి విడివిడిగా రుబ్బాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు కలిపి, రెండింటినీ ఒక్క గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ పిండిలో అల్లం, శెనగపప్పు కూడా వేసి ఆరు గంటలు పులి యబెట్టాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దికొద్దిగా నూనె రాసి ఇడ్లీలు పెట్టుకోవాలి. కొబ్బరి లేదా పల్లీ చట్నీలతో ఈ ఇడ్లీలు టేస్టీ గా ఉంటాయి. ఈ పద్ధతిలో కాకుండా కొర్రలను రవ్వగా చేసి ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు.

కొర్రల వలన ఉపయోగాలు

మనదేశంతో పాటు చైనా, నైజీరియాలో కొర్రలను ఎక్కువుగా పండిస్తారు. పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే కొర్రలను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

  •  కొర్రల్లో మధుమేహాన్ని అదుపులో ఉంచే లక్షణంతో పాటు వాపు, కఫం తగ్గించటం, కేన్సర్​ని ధరి చేరకుండా కాపాడతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.
  • కొర్రల్లో పీచు పదార్థం కాల్షియం, ఐరన్ మాంగనీస్, మెగ్నిషియం తోపాటు విటమిన్లు అధికంగా ఉంటాయి. చిన్నపిల్లలకు, గర్భిణుల కు కొర్రలు బలవర్దకమైన ఆహారం. ముఖ్యంగా కొర్రలతో చేసిన ఆహారం తింటే కొవ్వు పెరిగే సమస్య తక్కువ..
  • కొర్రలు కొంచెం వగరుగా.. గరుకుగాఉంటాయి. వీటిలో వేడి స్వభావం ఉంటుంది. కాబట్టి మజ్జిగతో కలిపి తినడం మంచిది
  • ఉదరసంబంధ వ్యాధులకు కొర్రలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా కడుపునొప్పి, ఆకలి మందగించడం లాంటి సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయి.
  • మానసికవ్యాధులు, టెన్షన్​, ఒత్తిడి, తదితర సమస్యలతో సతమతమయ్యేవారికి సెరటోనిన్​ అధికంగా అవసరమవుతుంది. సెరటోనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయోగ పడతాయి.
  • వీటిలో ఉండే మెగ్నిషియం మైగ్రేన్ తలనొప్పి, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నియాసిన్ (విటమిన్  -బీ3) చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్ గుణాలతో పాటు ప్రోటీన్లు కూడా కొద్రలో ఎక్కువగానే ఉన్నాయి. 
  •  గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు వచ్చి నపుడు కొర్ర గంజి తాగి.. దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపో తుందని పెద్దలు చెబతుంటారు

–వెలుగు,లైఫ్​–