బౌలర్లను ఉతికారేశాడు: గుజరాత్‎పై 29 బంతుల్లోనే కోహ్లీ మెరుపు హాఫ్ సెంచరీ

బౌలర్లను ఉతికారేశాడు: గుజరాత్‎పై 29 బంతుల్లోనే కోహ్లీ మెరుపు హాఫ్ సెంచరీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పీక్ ఫామ్‎లో ఉన్నాడు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‎లో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో అలరించిన కోహ్లీ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. దాదాపు 15 ఏండ్ల తర్వాత హోమ్ టీమ్ ఢిల్లీ తరుఫున విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన రన్ మెషిన్ తొలి మ్యాచులోనే సెంచరీతో కదం తొక్కాడు. 

ఆంధ్రప్రదేశ్‎తో జరిగిన మ్యాచులో 101 బాల్స్‌‌‌‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసి ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు. ఇదిలా ఉండగానే.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 26) గుజరాత్‎తో జరిగిన మ్యాచులో కోహ్లీ మరింత చెలరేగి ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఔరా అనిపించాడు. ఈ మ్యాచులో 61 బంతుల్లో 77 పరుగులు చేసిన కోహ్లీ (13 ఫోర్లు, ఒక సిక్సర్) కేవలం బౌండరీల ద్వారానే 58 పరుగులు సాధించడం గమనార్హం.

 కోహ్లీ భీకర ఫామ్‎లో పరుగుల వరద పారిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక.. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ పంత్ (70) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. చివర్లో హర్ష్ త్యాగి (40) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైస్వాల్ 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశాడు. స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీయగా.. నాగ్వాస్వాల్లా, చింతన్ గాజా చెరో వికెట్ సాధించారు.