
- ఎల్లుండి నుంచి బండి సంజయ్, అరవింద్, విజయశాంతి ప్రచారం
- ఇప్పటికే వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, రఘునందన్ క్యాంపెయిన్
- జిగ్నేష్ మేవాని, కన్హయ్య కుమార్, హార్ధిక్ పటేల్ ను రప్పించే ప్రయత్నాల్లో కాంగ్రెస్
- 25 నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం
హజురాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: హజూరాబాద్ బై ఎలక్షన్ క్యాంపెయిన్‌కు ఇంకా తొమ్మిది రోజులే మిగిలింది. పోలింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రధానపార్టీల అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఒక్కో అభ్యర్థి రోజుకు ఏడెనిమిది ఊర్లు తిరుగుతూ సెంటర్లలో మీటింగ్‌లు పెడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే నియోజకవర్గాన్ని దాదాపు ఒకసారి చుట్టేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ వారం కిందనే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వీరితోపాటు రిజిస్టర్డ్ పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్థులు, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న 20 మంది క్యాండిడేట్లు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఈ నెల 26 లేదా 27న సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించబోతుండగా.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు రాబోతున్నారు.
21 నుంచి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారం
బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తరఫున ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, కూన శ్రీశైలం గౌడ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి గత 20 రోజులుగా ఊరూరా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ప్రచారం చేసేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ హజూరాబాద్ రానున్నారు. వీరితోపాటు మాజీ మంత్రులు డీకే అరుణ, చంద్రశేఖర్, మాజీ ఎంపీ విజయశాంతి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు చాడ సురేశ్ రెడ్డి, రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ప్రచారానికి రానున్నారు. ఒక్కోనేత కనీసం ఐదారు రోజులు క్యాంపెయిన్ చేసేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.
చివరి మూడు రోజులు ప్రచారంలో రేవంత్
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు మద్దతుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ప్రచార ఘట్టం ముగిసే ముందు మూడు రోజులు ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హుజూరాబాద్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రచారంలో కాస్త వెనకబడినందున ఈ తొమ్మిది రోజుల్లో క్యాంపెయిన్ స్పీడప్ చేసేందుకు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. 25, 26, 27 తేదీల్లో రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించేలా ఆ పార్టీ నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. కన్హయ్య కుమార్, జిఘ్నేష్ మేవానీ, హార్థిక్ పటేల్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరి షెడ్యూల్ ఒకటి, రెండు రోజుల్లో ఫైనల్ కానుందని తెలిసింది.
టీఆర్ఎస్ ప్రచార భారమంతా హరీశ్ పైనే
టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార భారమంతా మంత్రి హరీశ్‌రావుపైనే పడింది. ఈటల రాజీనామా తర్వాత మంత్రి గంగుల కమలాకర్ మూడున్నర నెలలుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంటూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. రెండు నెలల కింద మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వీరికి తోడుగా 15 మందికి పైగా ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు దసరా పండుగకు ముందు వరకు ప్రచారంలో పాల్గొన్నారు. పండుగకు సొంత నియోజకవర్గాలకు తిరిగి వెళ్లిన వాళ్లలో ఎక్కువ మంది మళ్లీ ప్రచారానికి రాలేదు. పైగా టీఆర్‌ఎస్ ప్లీనరీ, సంస్థాగత నిర్మాణంపై కేటీఆర్ సమీక్షలు, ఇతర కారణాలతో కొందరు హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. కరోనా సోకడంతో మంత్రి గంగుల హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేటీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో హరీశ్ పైనే భారమంతా పడింది.
పెంచికలపేటలో కేసీఆర్ సభ
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వస్తానని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో ప్రచారం కంటే ఎల్కతుర్తి మండలం పెంచికలపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేసి సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సభ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే మంత్రి హరీశ్ రావుకు అప్పగించినట్లు సమాచారం. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మీదట కూడా ప్రచారానికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్ల బాధ్యతలో బిజీ గా ఉన్న ఆయన ప్రచారానికి రాకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.