
పంజాబ్‌లోని ప్రముఖ ప్రైవేట్ సంస్థ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(LPU). అమెరికా ఇటీవల భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పెంచటంతో స్వదేశీ 2.0కి పిలుపునిచ్చింది యూనివర్సిటీ. యూఎస్ ట్రేడ్ టారిఫ్స్ కి వ్యతిరేకంగా LPU తమ క్యాంపస్‌లో Coca-Cola, PepsiCo వంటి అమెరికన్ శీతలపానీయ బ్రాండ్లను పూర్తిగా నిషేధించింది. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్స్ 50%కి పెంచటాన్ని “ఆర్థిక దౌర్జన్యం”గా భావిస్తూ.. యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రకటించారు.
తాము తీసుకున్న నిర్ణయాన్ని మిట్టల్ 1905 నాటి స్వదేశీ ఉద్యమానికి సమానమైనదిగా పేర్కొన్నారు. భారత్ ఎవరి ముందు తలవంచబోదన్న మిట్టల్ తమ నిర్ణయాన్ని స్వదేశీ2.0 ఉద్యమం ప్రారంభమని అన్నారు. ఎల్‌పీయూ తాజా నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఇతర విద్యా సంస్థలు, యువకులు కూడా ఇలాంటి చర్యలకు తెరతీసే అవకాశముందని తెలుస్తోంది.
భారత మార్కెట్ నుండి అమెరికా కంపెనీలు సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో 140 కోట్ల మంది ఇండియన్స్ యూఎస్ వ్యాపార సంస్థలకు వ్యతిరేకంగా చర్యలకు ముందుకు రావాలని బహిరంగ లేఖలో మిట్టల్ పిలుపునిచ్చారు. అప్పుడే అమెరికాపై ప్రభావం ఉంటుందని చెప్పారు మిట్టల్. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం #Swadeshi2.0 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
LPU చర్య దేశ ఆర్థిక గౌరవాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో తీసుకున్నదిగా ఉంది. ఇది కేవలం కూల్ డ్రింక్స్ బహిష్కరణ మాత్రమే కాదని.. భారతదేశ ఆత్మగౌరవం, ఆర్థిక బలం, స్థానిక ఉత్పత్తులకు మద్దతుగా నడిపించే ఉద్యమంగా ప్రచారం సాగుతోంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారతదేశాన్ని విదేశీ ఆంక్షలు అడ్డుకోకుండా నిలబడటానికి ప్రజలు ముందుకు రావాలని మిట్టల్ కోరారు. ప్రస్తుతం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో దాదాపు 40వేల మంది విద్యార్థులు ఉండగా.. సంస్థ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.