పెళ్లైన రెండు నెలలకే కొండ పైనుంచి తోసేసిండు

పెళ్లైన రెండు నెలలకే కొండ పైనుంచి తోసేసిండు
  • పెండ్లయిన రెండు నెలలకే భార్య హత్య

అయిజ, వెలుగు: పెండ్లయిన రెండు నెలలకే అనుమానంతో భార్యను హత్య చేశాడు. సెల్ఫీ దిగుదామని చెప్పి గుట్టపైకి తీసుకువెళ్లి అక్కడి నుంచి కిందకు తోసి చంపేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అయిజ పీఎస్ లో శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు. అలంపూర్ మండలం జిల్లెలపాడు గ్రామానికి చెందిన  మద్దిలేటి గౌడ్ భార్యా పిల్లలతో అయిజ మున్సిపాలిటీ పరిధిపురం గ్రామంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. వారి పెద్ద కుమార్తె శరణ్య అలియాస్ గీతాంజలి(19)ని గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన ఈడిగ జయరాములు గౌడ్ తో రెండు నెలల కిందట పెండ్లి జరిపించారు. భార్య తనతో చనువుగా ఉండటం లేదని జయరాములు గౌడ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. అప్పటికే జయరాములుకు వేరే అమ్మాయితో సంబంధం ఉండడంతో ఎలాగైనా గీతాంజలిని వదిలించుకోవాలని అనుకున్నాడు. జయరాములు గౌడ్ వనపర్తి లో  ఇంటర్ ​చదివేటప్పుడు తిరుమలయ్య గుట్ట చూశాడు. గీతాంజలిని అక్కడకు తీసుకెళ్లి చంపితే ఎవరికీ అనుమానం రాదని అనుకున్నాడు. ఈ నెల 11న ఆధార్ కార్డులో అడ్రస్ మార్పిస్తానంటూ భార్యను బైక్​పై అయిజకు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి వనపర్తి సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్ట గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వద్దామని ఆమెను నమ్మించాడు. తిరుమలయ్య గుట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర సెల్ఫీలు దిగుదామని భార్యను కొండ అంచు వరకు తీసుకువెళ్లాడు. ఫోటోలు దిగుతున్నట్లు నటించి ఎవరూ లేని సమయంలో కిందకు తోసేశాడు. 

కనిపిస్తలేదని నమ్మించే యత్నం
భార్యను చంపిన తర్వాత తనమీద అనుమానం రాకూడదనే ఉద్దేశంతో బైక్ పై బయలుదేరి మధ్యాహ్నానికి అయిజ చేరుకున్నాడు. అత్తమామకు ఫోన్​చేసి గీతాంజలి కనిపించడం లేదని చెప్పాడు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు చేయించుకునేందుకు గట్టు మండల కేంద్రంలోని ఆధార్ సెంటర్ కి వెళ్లామని, అక్కడ నెట్ వర్క్ సమస్య వచ్చిందని చెప్పాడు. కొద్దిసేపటికి గీతాంజలికి కడుపునొప్పి రావడంతో అయిజలోని  ప్రైవేట్ హాస్పిటల్ కు బయలుదేరామని, బస్టాండ్ దగ్గర తన బైక్ పాడవడంతో తన అక్క ఇంటికి వెళ్లమని చెప్పి పంపించానన్నాడు. అక్క ఇంటికి ఆమె వెళ్లలేదని, ఎక్కడా కనిపించడం లేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. గీతాంజలి తండ్రి మద్దిలేటికి అల్లుడుపై అనుమానం వచ్చి ఈ నెల 12న అయిజ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయరాములు గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో నేరం ఒప్పుకున్నాడు. జయరాములు గౌడ్ ను తిరుమలయ్య గుట్ట వద్దకు తీసుకెళ్లి పరిశీలించగా అక్కడ గీతాంజలి మృతదేహం కనిపించింది. శవాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసును సాల్వ్​చేసిన గద్వాల డీఎస్పీ యాదగిరి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై జగదీశ్వర్, పీసీలు శివశంకర్,  శ్రీనివాసులును ఎస్పీ అభినందించారు.