ఆర్థిక కష్టాలు..కుటుంబ గొడవలు.. తల్లి, కొడుకును చంపి సూసైడ్

ఆర్థిక కష్టాలు..కుటుంబ గొడవలు..  తల్లి, కొడుకును చంపి సూసైడ్
  • అఘాయిత్యానికి పాల్పడిన ఇంటిపెద్ద 
  • సిద్దిపేట జిల్లా వడ్లూరులో విషాదం 

బెజ్జంకి, వెలుగు: కుటుంబ గొడవల కారణంగా తల్లి, కొడుకును చంపేసి ఒకరు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలం వడ్లూరుకు చెందిన జక్కని సత్తయ్య(68), దేవవ్వ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. సత్తయ్యకు తల్లి యశోద ఉంది. సొంతూరిలో సత్తయ్య హోటల్ నడుపుతున్నాడు. పెద్ద కొడుకుకు పెండ్లి చేయగా, గంగాధరలో హోటల్ పెట్టుకుని కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. రెండో కొడుకు సురేశ్(35), సిరిసిల్లలో ల్యాబ్ టెక్నిషియన్ గా చేస్తున్నాడు. మూడో కొడుకు రాజు సిరిసిల్లలో ఆటో నడుపుతున్నాడు. సురేశ్, రాజుకు పెండ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండగా కుదరడంలేదు. నెల రోజులుగా హోటల్ ను మూసి వేయడంతో  ఆర్థిక ఇబ్బందులు రాగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.

కొద్దిరోజులుగా సురేశ్ ఇంటివద్దనే ఉంటున్నాడు. శనివారం ఉదయం సత్తయ్య భార్య ఆస్పత్రిలో చూపించుకునేందుకు  సిరిసిల్ల వెళ్లి సాయంత్రం తిరిగొచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి అత్త యశోద(90), రెండో కొడుకు సురేశ్(35), రక్తపు మడుగులో చనిపోయి ఉండి, పక్క గదిలో భర్త సత్తయ్య ఉరేసుకుని  కనిపించారు. కుటుంబంలో గొడవల కారణంగానే కొడుకును, అత్తను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య దేవవ్వ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్,  అడిషనల్ సీపీ  కుషాల్కర్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ శీను ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.