అమెరికాలో మరో తెలుగు సంఘం..‘మాట’ పేరుతో ఏర్పాటు

అమెరికాలో మరో తెలుగు సంఘం..‘మాట’ పేరుతో ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: అమెరికాలో మరో  తెలుగు అసోసియేషన్ ప్రారంభమైంది. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవా, సంస్కృతి, సమానత్వం అనే మూడు సూత్రాలతో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాట)’ పేరుతో సంఘం ఏర్పాటైంది. న్యూయార్క్​లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో 2,500 మంది దాకా తెలుగు ప్రజలు పాల్గొన్నారని ‘మాట’ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల తెలిపారు. తమ సంస్థ ద్వారా యువతను ప్రోత్సహిస్తామని చెప్పారు.

న్యూజెర్సీ, న్యూయార్క్, గ్రేటర్ ఫిల్లీ, అల్బానీ, మేరీల్యాండ్, వర్జీనియా, టంపా, డల్లాస్, చికాగో వంటి సుమారు 20 నగరాల్లో ‘మాట’ చాప్టర్లను ప్రారంభించినట్టు తెలిపారు. ఓహియో, సెయింట్ లూయిస్, లాస్ ఏంజిల్స్, సీఏ, సీటెల్ నుంచి 2 వేల మంది జీవిత సభ్యులుగా నమోదయ్యారని పేర్కొన్నారు. తానా, ఆట, నాటా, నాట్స్ తదితర స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా హాజరై, ‘మాట’ ప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు సునీత, అనిరుధ్ పాల్గొని.. తమ పాటలతో అలరించారు.

స్వాతి అట్లూరి తన 70 మంది బృందంతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో మాట కోర్ టీమ్ సభ్యులు శ్రీధర్ చిల్లర, దాము గేదెల, శ్రీ అట్లూరి, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, డాక్ర్ స్టానెలీ రెడ్డి, పవన్ దరిసి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ రెడ్డి కోనాల, కిరణ్ దుద్దగి, ప్రవీణ్ గూడూరు, మహేందర్ నరాల, జయ తెలుకుంట్ల, శిరీష గుండపనేని తదితరులు పాల్గొన్నారు.