ఎన్జీటీని ఏమార్చారు!.. డంపింగ్ యార్డ్నిర్వహణ పై మంచిర్యాల కార్పొరేషన్ తప్పుడు రిపోర్ట్

ఎన్జీటీని ఏమార్చారు!.. డంపింగ్ యార్డ్నిర్వహణ పై  మంచిర్యాల కార్పొరేషన్ తప్పుడు రిపోర్ట్
  • చెత్తకుప్పలు మండుతున్నా పొగలు రావట్లేదని బుకాయింపు
  • ప్రజారోగ్య రక్షణ చర్యలు అంతా బోగస్​ అంటున్న ప్రజలు 
  • యార్డు కొనసాగింపునకు రిక్వెస్ట్​.. నేడు ఎన్​జీటీ ఎంక్వైరీ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల అండాలమ్మ కాలనీలోని డంపింగ్​యార్డు నిర్వహణపై కార్పొరేషన్​ అధికారులు దాగుడుమూతలాడుతున్నారు. ఓవైపు చెత్తకుప్పలు కుంపటిలా మండుతున్నా.. వాటి నుంచి ఎలాంటి పొగలు రావడం లేదని, విషవాయువులు వెలువడడమే లేదని నేషనల్​గ్రీన్​ట్రిబ్యునల్(ఎన్​జీటీ)కి తప్పుడు రిపోర్టు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. డంపింగ్​యార్డు వల్ల ప్రజారోగ్యానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇవ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. యార్డు కారణంగా పాతికేండ్లుగా అవస్థలు పడుతూ అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్​ అధికారులు వాస్తవాలను దాచిపెట్టి ఏకంగా ఎన్​జీటీనే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శుక్రవారం ఎన్​జీటీ అధికారులు ఎంక్వైరీ చేపడుతున్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 

విషవాయువులతో రోగాలు

అండాలమ్మ కాలనీలోని రెండెకరాల్లో 2000 సంవత్సరంలో టెంపరరీ డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. అప్పటినుంచి సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్​నిర్వహణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. మంచిర్యాలలో రోజుకు దాదాపు 50 మెట్రిక్​టన్నుల చెత్త పోగవుతుంది. దానిని డంపింగ్​యార్డులో గుట్టలుగా పోస్తున్నారు. ఇలా పేరుకుపోతున్న చెత్తకుప్పలను కాల్చివేస్తున్నారు. అందులో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్రమాదకరమైన విషవాయువులు వెలువడుతున్నాయి. పగలు, రాత్రి దట్టమైన పొగలు అండలమ్మ కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేస్తున్నాయి. దీంతో ఊపిరి సలపని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషవాయువుల ప్రభావంతో పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. గత్యంతరం లేక డాక్టర్ల సూచన మేరకు పలువురు నెబ్యులైజర్లు వాడుతూ ఉపశమనం పొందుతున్నారు. 

షిఫ్టింగ్​పై నిర్లక్ష్యం

అండాలమ్మ కాలనీ నుంచి డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని కాలనీవాసులు అనేక సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారి గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. 2023 సెప్టెంబర్​లో సామాజిక కార్యకర్త నయీం పాషా ఈ సమస్యపై ఎన్​జీటీలో కంప్లైంట్ చేశాడు. దీంతో 2024 మార్చి 31న స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్​మెంటల్ ఇంజనీర్ హనుమంతరెడ్డి, బోర్డ్ ఆఫీసర్ లక్ష్మీప్రసాద్ డంపింగ్ యార్డును సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే డంపింగ్ యార్డును అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో మూడు నెలల్లో యార్డును శ్రీరాంపూర్​కు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికి రెండేండ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రోగ్రెస్​లేదని ప్రభావిత ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. 

ఎన్​జీటీకి తప్పుడు రిపోర్ట్​...

డంపింగ్​యార్డు కోసం మంచిర్యాల, హాజీపూర్​మండలాల్లో గవర్నమెంట్​భూములు దొరడం లేదని, గతంలో పోచంపహాడ్​లో నాలుగు ఎకరాలు చూసినప్పటికీ స్థానికులు వ్యతిరేకించారని, అండాలమ్మ కాలనీలో అప్పటికే డంపింగ్​యార్డు ఉందని తెలిసినప్పటికీ స్థానికులకు పట్టాలు ఇచ్చారని ఎన్​జీటీకి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టి లెగసీ వేస్ట్​ను తొలగించామని, మంటల నివారణకు రెండు వాటర్​ట్యాంకర్లను 24 గంటలు అందుబాటులో ఉంచామని, దుర్వాసన రాకుండా వారానికి రెండుసార్లు బయో ఎంజైమ్​ స్ర్పే చేస్తున్నామని బదులిచ్చారు. అలాగే ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ఎప్పటికప్పుడు చెక్​చేస్తున్నామని, లీచింగ్ మేనేజ్​మెంట్​చేస్తున్నామని, చుట్టుపక్కల కాలనీల్లో మెడికల్​క్యాంపులు నిర్వహిస్తూ హెల్త్​మానిటరింగ్​చేస్తున్నామని పేర్కొన్నారు.

కార్పొరేషన్​ పరిధిలో ప్రత్యామ్నాయ స్థలాలు దొరకనందున ఎంఎస్​డబ్ల్యూ రూల్స్​కు అనుగుణంగా డంపింగ్​ యార్డును కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ ఇందులో చాలా అంశాలు అమలు కావడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఎప్పటిలాగే డంపింగ్​యార్డులోని చెత్త కుప్పలను కాల్చడం వల్ల దట్టమైన పొగలు కాలనీలను కమ్మేస్తున్నాయని వాపోతున్నారు. యార్డును తరలించడమే ఏకైక పరిష్కారమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎంక్వైరీ చేపట్టనున్నారు.