మానేరు రివర్ ఫ్రంట్ పనులు ముందుకు సాగేనా?

మానేరు రివర్ ఫ్రంట్ పనులు  ముందుకు సాగేనా?
  • పనుల కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.546 కోట్లు కేటాయింపు
  •     ఇప్పటి వరకు ఏజెన్సీకి రూ.226 కోట్ల చెల్లింపు
  •     పనుల్లో నాణ్యత లోపాలున్నాయనే ఆరోపణలు
  •     నేడు మానేరు రివర్ ఫ్రంట్  పనులపై  మంత్రుల సమావేశం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో టూరిజం అట్రాక్షన్ గా నిలిచిపోయేలా చేపట్టిన మానేరు రివర్  ఫ్రంట్  పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎన్జీటీ స్టేతో గతంలో సుమారు ఏడాదిపాటు నిలిచిపోయిన పనులు ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ.. తరుచూ ఆగుతూ సాగుతున్నాయి. బీఆర్ఎస్  హయాంలో చేపట్టిన మానేరు రివర్​ ఫ్రంట్  పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. పనులు పూర్తి కాకముందే రూ.226 కోట్ల బిల్లులు చెల్లించారని, నదిలో రాళ్లు పగులగొట్టకుండానే రూ.30 కోట్లు డ్రా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఎండీ నుంచి లక్షలాది టిప్పర్ల మట్టిని తరలించారనే విమర్శలున్నాయి. దీంతో ఈ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలనే డిమాండ్  అప్పట్లో కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ పక్షాల నుంచి వినిపించింది. మానేరు రివర్  ఫ్రంట్  పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై సమీక్షించేందుకు జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్​కుమార్ తోపాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఆదివారం సమావేశం కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంతోనైనా రివర్ ఫ్రంట్  పనులు ఊపందుకుంటాయని నగరవాసులు భావిస్తున్నారు. 

రూ.546 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్.. 

గత సర్కార్  హయాంలో 2022 మార్చిలో తొలుత రూ.410 కోట్లతో మానేరు రివర్  ఫ్రంట్  పనులు ప్రారంభం కాగా.. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని రూ. 546 కోట్లకు పెంచారు. ఇందులో రూ.100 కోట్ల విలువైన పనులు టూరిజం డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో, రూ.446 కోట్ల పనులు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు అదనపు హంగుగా మరో రూ.196 కోట్లతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రాజెక్టులో భాగంగా నదికి ఇరువైపులా ప్రొటెక్షన్  వాల్స్, నదిలో, నదీతీరాన బోటింగ్, అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్  స్పోర్ట్స్, ఫౌంటేన్లు, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్  సిటిజన్  గార్డెన్స్, ప్లవర్  గార్డెన్లు, రాక్  గార్డెన్లు, లేజర్  షోలు, విశాలమైన లాండ్  స్కేపింగ్స్  ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 3.7 కిలోమీటర్ల మేరకు ప్రొటెక్షన్స్  వాల్స్, బండ్  నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇరువైపులా బండ్  నిర్మాణం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఎండీ నుంచి మట్టిని తరలించారనే ఆరోపణలున్నాయి. డ్యాంలో మట్టి తవ్వకూడదని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్  డ్యాంలో మట్టిని తవ్వి తరలిస్తే.. అప్పటి ఆఫీసర్లు రూ. 55 కోట్ల బిల్లులు రికార్డు చేసి కాంట్రాక్ట్  ఏజెన్సీకి చెల్లించారు. అంతేగాక నదిలో బోటింగ్ కు ఇబ్బందుల్లేకుండా బండరాళ్లు తొలగించాల్సి ఉండగా.. కొంతమేర తొలగించి రూ.30 కోట్ల బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. టెండర్  నిబంధనల ప్రకారం ఆ బండరాళ్లను సుదూర ప్రాంతంలో వేయాలని షరతు ఉంటే.. దాన్ని పాటించకుండా క్రషర్, రిబిట్ మెంట్, డస్ట్​గా మార్చి అక్రమంగా ఇవే పనుల్లో వాడుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మానేరు నదిపై నిర్మించిన కేబుల్  బ్రిడ్జి అధ్వానంగా మారింది . రాత్రి సమయంలో లైట్లు 
వెలగడం లేదు. 

చెక్ డ్యామ్  కాంట్రాక్టర్ పై చర్యలేవి ? 

కరీంనగర్  సిటీ నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లు ప్రస్తుతం మానేరులో కలుస్తున్నాయి. అది పూర్తిగా నేషనల్  గ్రీన్  ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిబంధనలకు వ్యతిరేకం. ఇక్కడ సీవరేజ్  ట్రీట్ మెంట్  ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టలేదు. అంతేగాక రివర్  ఫ్రంట్ లో నీళ్లు నిలిచేందుకు వీలుగా దిగువన చెక్ డ్యాం నిర్మించగా.. మానేరు స్పిల్ వే గేట్లు ఎత్తినప్పుడు వరదకు కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు 
తీసుకోలేదు.