అవీ- ఇవీ

అవీ- ఇవీ

రోడ్డుమీద నడిచేటప్పుడు కూడా ఫోన్ వాడుతుంటారు చాలామంది. ఈ అలవాటు వల్ల ఎదురొచ్చే వాహనాలు, మనుషులకు అడ్డుతగులుతుంటారు. ఇలాంటి పనుల వల్ల కొన్నిసార్లు చివాట్లు కూడా తప్పవు. ఈ ప్రాబ్లమ్‌‌‌‌ను మరీ సీరియస్‌‌‌‌గా తీసుకుందేమో.. అలాంటివాళ్ల కోసం మూడో కన్ను తయారుచేసింది లండన్‌‌‌‌కి చెందిన ఓ స్టూడెంట్.సౌత్ కొరియాకు చెందిన మిన్‌‌‌‌వూక్ పాయెంగ్.. లండన్‌‌‌‌లో ఇండస్ట్రియల్ డిజైనింగ్ చదువుతోంది. లండన్, సియోల్ లాంటి నగరాల్లో చాలామంది రోడ్డుపై నడిచేటప్పుడు కూడా ఫోన్ వాడుతూ, ఫోన్ నుంచి చూపు తిప్పరు. దీనివల్ల మ్యాన్ హోల్స్‌‌‌‌లో పడడం, యాక్సిడెంట్స్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి.

దీనికోసం ఏదైనా కనిపెట్టాలనుకుంది డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మిన్‌‌‌‌వూక్. కొన్ని నెలలు రీసెర్చ్ చేసి ‘డిజీన్’ అనే ఆర్టిఫిషియల్ కన్ను తయారుచేసింది. నడిచేటప్పుడు దీన్ని తలకు పెట్టుకుంటే.. ఈ ఆర్టిఫిషియల్ మూడోకన్ను దారిలో అడ్డంకులను గుర్తిస్తుంది. కెమెరాలో ఉండే అల్ట్రా సోనిక్ సెన్సర్ దారికి అడ్డు వచ్చిన వాటిని గుర్తించి హెడ్‌‌‌‌ఫోన్స్‌‌‌‌ ద్వారా చెవిలో వార్నింగ్ ఇస్తుంది. సరదాగా దీన్ని కనిపెట్టానంటున్న మిన్‌‌‌‌వూక్ మాట్లాడుతూ “మొబైల్ వాడకాన్ని ఎలాగూ తగ్గించడం లేదు. కనీసం ప్రమాదాలైనా తగ్గించొచ్చని దీన్ని కనిపెట్టా. మొబైల్ ఎక్కువగా వాడే అలవాటు మానకపోతే వెన్నెముక ముందుకి వంగిపోయి, రాబోయే తరాల వాళ్లు కొత్త జీవుల్లా తయారవుతార’’ని అంటోంది.

ఊరికే జీతమిస్తున్నారట!

‘నాకు జీతం ఎందుకు పెంచట్లేదు’ అని అడిగే ఉద్యోగులను చాలా చోట్ల చూస్తుంటాం. కానీ, ఐర్లెండ్‌‌‌‌లో ఓ ఉద్యోగి మాత్రం ‘నాకు జీతం ఎందుకు ఇస్తున్నారు?’ అని అడుగుతున్నాడు. ఏ పనీ చేయకపోయినా తనకు నెలకు కోటి రూపాయలకు పైగా జీతం వస్తోందట. దీంతో అతను  ‘జీతమెందుకు ఇస్తున్నారు?’ అంటూ కోర్టుకెక్కాడు. ఇంతకీ జరిగిందేంటంటే..
ఐర్లెండ్‌‌‌‌లో  రైల్వే ఉద్యోగి అయిన డెర్మోత్ అలస్టెర్‌‌‌‌కు గత కొన్నేండ్ల నుంచి ఉచితంగా జీతం ఇస్తున్నారట. ఏ పనీ చేయకుండా జీతం తీసుకోవడం అతనికి అవమానంగా అనిపించిందట. అందుకే ఈ విషయంపై అతను కోర్టుకెక్కాడు. డెర్మోత్ 2014లో కంపెనీ అకౌంటింగ్‌‌‌‌లో జరుగుతున్న ఫ్రాడ్‌‌‌‌ను బయటపెట్టాడు. అప్పటినుంచి అధికారులు అతనికి ఏ పనీ అప్పజెప్పట్లేదు. దాంతో  రోజూ ఖాళీగా ఉండాల్సి వస్తోందని డెర్మోత్ కోర్టులో కంప్లెయింట్ చేశాడు.

“నేను రోజూ రెండు న్యూస్ పేపర్లు, శాండ్‌‌‌‌విచ్ కొనుక్కుని ఆఫీసుకు వెళ్తా. నా క్యాబిన్‌‌‌‌లోకి వెళ్లి, కంప్యూటర్ ఆన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటా.  కానీ, నాకు ఏ మెయిల్స్ రావు. దాంతో న్యూస్ పేపర్ చదివి.. శాండ్‌‌‌‌విచ్ తినేసి ఖాళీగా కూర్చుంటున్నా. వారంలో ఒక్క రోజైనా పనిచేసే అవకాశం దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తా. కానీ, నాకు ఏపనీ ఉండదు. నెలకు కోటి రూపాయలకు పైగా శాలరీ చెక్కు వస్తుంది. ప్రభుత్వం నా స్కిల్స్ వాడుకోవట్లేదు. నాపై వివక్ష చూపిస్తోంది. నన్ను ఒంటరితనం చికాకు పెడుతోంది” అని డెర్మోత్ పిటిషన్ రాశాడు. ఈ కేసు వచ్చే ఏడాది హియరింగ్‌‌‌‌కు వస్తుంది.

భూమి స్పీడు పెరిగింది

భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది అని చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. అయితే ఇప్పుడా లెక్క కాస్త తప్పింది.  ఎందుకంటే ఇప్పుడు భూమి  స్పీడ్ పెరిగింది.  24 గంటలు పూర్తవ్వక ముందే భూమి ఒక రౌండ్ తిరుగుతోందట! దీంతో టైంని కొలిచే లెక్కలన్నీ మారిపోతాయంటున్నారు సైంటిస్టులు. కొన్నేండ్లుగా భూమి వేగంగా తిరిగేస్తోంది. దీంతో రోజులు చిన్నవైపోతున్నాయి. ఇటీవలే భూమి చరిత్రలో అతి చిన్న రోజు నమోదైంది. 24 గంటలు పూర్తవ్వడానికి ఇంకా 1.59 మిల్లీ సెకండ్ల టైం మిగిలి ఉండగానే భూమి తన చుట్టూ తాను తిరిగేసింది.

మిల్లీ సెకండ్‌‌‌‌లో ఏముంది అనుకుంటున్నారేమో.. అక్కడే అంతా ఉందంటున్నారు సైంటిస్టులు. ప్రపంచమంతా టైంతో కనెక్ట్ అవ్వడానికి దేశాలు తమ గడియారాలను యూనివర్సల్‌‌‌‌ టైం ప్రకారం సరిచేసుకుంటాయి. ఈ యూనివర్సల్ టైంను ఎటామిక్ గడియారాల ద్వారా కొలుస్తారు. ఇవి భూమి తిరిగే వేగాన్ని బట్టి పనిచేస్తుంటాయి.  ఒక్క మిల్లీసెకండ్ తేడా వచ్చినా లెక్కలన్నీ మారిపోతాయి.  జీపీఎస్‌‌‌‌, శాటిలైట్  వంటివి పనిచేయటానికి కచ్చితమైన టైం అవసరం.

కాబట్టి, భూమి వేగం ఇలాగే పెరుగుతూ పోతే ముందుముందు గడియారాల నుంచి ఒక సెకండు టైంను తొలగించాల్సి వస్తుందట. అలా చేస్తే సాఫ్ట్‌‌‌‌వేర్, ఇంటర్నెట్ సిస్టమ్స్‌‌‌‌కు పెద్ద తలనొప్పే. ప్రస్తుతమున్న కంప్యూటర్‌‌‌‌ సర్వర్లు టైంని సెకండ్ల ప్రకారం లెక్కించుకుంటూ పనిచేస్తాయి.  దీన్ని ‘ఎపోక్‌‌‌‌ టైమ్‌‌‌‌’ అంటారు. ఇప్పుడు గడియారంలో ఒక సెకండ్ తొలగిస్తే సర్వర్ల పనితీరు దెబ్బతింటుంది. ఇంటర్నెట్‌‌‌‌ సేవలు కూడా ఆగిపోతాయి. వాటన్నింటినీ మళ్లీ సరిచేయాలి. అసలు భూమి స్పీడ్‌‌‌‌గా ఎందుకు తిరుగుతోందో కచ్చితమైన కారణాన్ని సైంటిస్టులు తెలుసుకోలేకపోయారు. వాతావరణ మార్పుల నుంచి చంద్రుడి గ్రావిటీ వరకూ చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు.