ఆధ్యాత్మికం.. దేవాలయం అంటే ఏమిటి.. గుడికి .. దేహానికి గల సంబంధం ఇదే..! 

ఆధ్యాత్మికం.. దేవాలయం అంటే ఏమిటి.. గుడికి .. దేహానికి గల సంబంధం ఇదే..! 

శరీరానికి దేవాలయం ప్రతీక. మనిషి శరీరంలోని ఒక్కో అవయవం, గుడిలోని ఒక్కో భాగాన్ని తెలియజేస్తుంది. శరీరంలో కాలి వేళ్ల నుంచి తల వరకు ఉన్న అవయవాలకు, ఆలయంలోని ముఖద్వారం నుంచి గర్భగుడి వరకు ఉన్న కట్టడాలకు పోలిక ఉంది.

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కనిపించే గోపురం శరీరంలోని పాదాలతో సమానం. దేవాలయానికి రక్షణగా చుట్టూ ఉన్న ప్రాకారాలు కాళ్లలాంటివి. దేవాలయంలో గోపురం దాటిన తర్వాత గర్భగుడికి ఎదురుగా కనిపించే ధ్వజస్తంభానికి జననాంగం ప్రతీక. మనిషి గాలి తీసుకోవడానికి, వదలడానికి సహకరించే ప్రధాన భాగం నాభి. అందుకే నాభిని దేవాలయంలో కనిపించే బలిపీఠంతో సమానంగా భావిస్తారు. అందుకే భక్తులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి తమలోని అహాన్ని పోగొట్టుకోవాలని పురాణాలు చెప్తున్నాయి.. గర్భగుడి ముందు ఉండే మండపం పొట్టతో సమానం. గర్భగుడిని మెడతో పోల్చుతారు. దేవాలయంలోని శిఖరం మనిషి తల లాంటిది. దేవాలయాన్ని ఎలా రోజూ శుభ్రం చేసి, దేవుడికి ధూపదీపనైవేద్యాలతో పూజలు చేస్తారో, మనుషులు కూడా అలాగే చేస్తారు. దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా భావించడం అంటే శరీరాన్ని పుణ్యక్షేత్రంగా భావించమని అర్ధం.

పూజలే మంచి పనులు

దేవాలయానికి వెళ్లి, గుడిలోని దేవుడ్ని దర్శించుకోవడం అంటే ఎవర్ని వాళ్లు పూర్తిగా తెలుసుకోవడమే అని వేదాంత గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే దేవాలయాల్లో చేసే పూజలు కేవలం బాహ్యమైనవి మాత్రమే. నిజమైన పూజఅంటే, ప్రతి ఒక్కరు తమలో ఉన్న మనసును పూజించుకోవాలి. పూజించడం అంటే ప్రతి పనిని మనస్పూర్తిగా చేయాలి.

 మంచి, చెడు ఆలోచించి చేయాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి. తమలో దేవుడు ఉన్నాడని భావిస్తే తప్పులు చేయరు. అందుకే పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు 'దేహమే దేవాలయం. జీవుడే దైవం' అని చెప్తాయి. జ్ఞానులు, యోగులు తమ శరీరాలను దేవాలయాలుగా భావించారు. మనసునే దేవుడిగా భావించి ఆరాధించారు. ఎవరికీ హాని చేయకుండా, ఇతరులకు మంచి చేస్తూ బతకడమే పూజచేయడంలోని అంతరార్థం. అందుకే శరీరాన్ని ఇతరులకు ఉపయోగపడే ఒక సాధనంగా మాత్రమే చూడాలి. గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని ఆత్మగా భావించాలి.

చక్రాలే మండపాలు

అన్ని దేవాలయాల్లో ఏడు మండపాలు ఉండవు. కానీ ఏడు మండపాలు ఉన్న దేవాలయాలనే పరిపూర్ణ దేవాలయాలని పిలుస్తారు. ఎందుకంటే.. శివసంహిత.. భాగవతాల్లో సప్తచక్రాల ప్రస్తావన ఉంది. మనిషి శరీరంలో కూడా ఏడు చక్రాలు ఉన్నాయంటారు వేదాంతులు. శరీరంలో ఉండే ఒక్కో చక్రం దేవాలయంలో ఉండే ఒక్కో మండపానికి ప్రతీకగా భావించాలి.

ప్రధాన ద్వారం మూలాధార చక్రం. సౌభాగ్య మండపం స్వాధిష్ఠాన చక్రం. యోగమండపం మణిపూరక మండపం. నవరంగ మండపం అనాహత చక్రం. అంతరాళ మండపం విశుద్ధి చక్రం.. ఇలా మనిషి శరీరంలో ఉండే చక్రాలకు, దేవాలయంలోని మండపాలకు సంబంధం ఉంది. మనిషి సంతోషంగా, సుఖంగా ఉండటానికి ఈ చక్రాలు ఉపయోగపడతాయి. ఈ చక్రాల కలయిక వల్లే మనుషులు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతారు. దేవాలయంలో ఒక మండపానికి మరో మండపానికి సంబంధం ఉన్నట్లే శరీరంలోని చక్రాలకూ ఒక లింకు ఉంటుంది.

–వెలుగు, లైఫ్​–