టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైన హార్మూజ్ జల సంధిని 48 గంటల్లోగా తెరవాలని.. లేదంటే ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలను పూర్తిగా తుడిచి పెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డైడ్ లైన్‌కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. హోర్ముజ్ జలసంధి కేవలం ఇరాన్ శత్రు దేశాలకు మాత్రమే క్లోజ్ చేసి ఉంటుందని తెలిపింది. మిగిలిన దేశాలు ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే విదేశీ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.
ఈ మేరకు అంతర్జాతీయ సముద్ర సంస్థలో ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి మాట్లాడుతూ.. టెహ్రాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని తప్పనిసరిగా పరిరక్షించుకుంటామన్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల వేళ సముద్ర భద్రతను పెంపొందించడానికి ఇతర దేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని తెలిపారు.
►ALSO READ | విమానం దిగుతూ తడబడిన ట్రంప్.. ఆరోగ్యంపై మరోసారి చర్చ
ఇరాన్‌కు దౌత్యం తొలి ప్రాధాన్యత అని.. కానీ తమపై దురాక్రమణను పూర్తిగా నిలిపివేయాలన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, హోర్ముజ్ జలసంధిలోని ప్రస్తుత పరిస్థితికి మూలమని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను అమెరికా తుడిచిపెట్టేస్తుందని డెడ్ లైన్ విధించారు.
